Kamareddy | కామారెడ్డి, పిట్లం జూలై 10 : దాబాల్లో అక్రమ మద్యం విక్రయాలు, సిట్టింగులు లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పిట్లం ఎస్సై ఆంజనేయులు హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు పిట్లం మండలంలోని దుర్గ భవాని (సంతు) దాబాలో అక్రమంగా మద్యం విక్రయాలు, సిట్టింగులు నిర్వహిస్తూ గతంలో విధించిన బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించిన దాబా యజమాని రాథోడ్ సంతోష్‌పై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఎమ్మార్వో సమక్షంలో రూ.15 వేల జరిమానా విధించడంతో పాటు, భవిష్యత్‌లో నిబంధనలు ఉల్లంఘించకుండా రూ.లక్షకు మళ్లీ బైండోవర్ చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై జరిమానాలు, భారీ మొత్తాలకు బైండోవర్‌తో పాటు చట్టపరమైన కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేక తనిఖీలు కొనసాగనున్నట్లు ఆయన తెలిపారు.