వేల్పూర్ , మే 19: భారత రాష్ట్ర సమితికి కార్యకర్తలే బలమని, పార్టీ కోసం పనిచేసే వారికి కచ్చితంగా సముచిత గౌరవం దక్కుతుందని రాష్ట్ర రోడ్లు భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. పార్టీ జెండా మోసే వారిని అధినేత కేసీఆర్ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారని, అలాంటి వారు ఏమూలన ఉన్నా కచ్చితంగా పదవి వరిస్తుందన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండల క్లస్టర్-2 గ్రామాల బీఆర్ఎస్ కుటుంబసభ్యుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం లక్కోర సమీపంలోని ఏఎన్జీ ఫంక్షన్హాల్లో నిర్వహించారు. సమ్మేళనంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తన సతీమణి నీరజారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ తన తండ్రి, రైతు నాయకుడు వేముల సురేందర్‌రెడ్డి కోసం నాడు పని చేశారని..నేడు తనతో పనిచేస్తున్నారని, ఇది అరుదుగా లభించే గౌరవం అన్నారు. నాడు మీ తండ్రులు మా తండ్రి గారికి తోడుగా ఉంటే …నేడు నాకు మీరు తోడుగా ఉన్నారు..ఏమిచ్చినా మీ ఆప్యాయత, రుణం తీర్చుకోలేనిదని మంత్రి భావోద్వేగానికి లోనయ్యారు. ఉద్యమకాలం నుంచి వెన్నంటి ఉండి నేడు అభివృద్ధిలో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తాను రాజకీయాల్లోకి వచ్చే ముందు తన తండ్రి చెప్పిన మూడు సూత్రాలకు కట్టుబడి ఉన్నానని, అందుకే అధినేత కేసీఆర్ దగ్గర చనువుగా,నమ్మకంగా మెదిలే అవకాశం కలిగిందన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి గౌరవం దక్కుతుందని, 2001 ఉద్యమం నుంచి పనిచేసిన జడ్పీచైర్మన్ దాదన్నగారి విఠల్ రావుకు దక్కిన పదవులే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు.
సంపదను సృష్టిస్తూ.. పేదలకు పంచుతూ..
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో నంబర్ వన్‌గా ఎదిగిందని మంత్రి వేముల గుర్తుచేశారు. ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉన్న తెలంగాణ.. నేడు దేశానికే అన్నం పెడుతున్న రాష్ట్రంగా అవతరించిందన్నారు. రైతులు, పేదలు ఎక్కడ సంతోషంగా ఉన్నారంటే..తెలంగాణ వైపు, సీఎం కేసీఆర్ వైపు దేశం మొత్తం ఆసక్తిగా చూస్తున్నారన్నారు. కులవృత్తులకు ప్రోత్సాహకాలు, సంక్షేమ పథకాలు, వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు యావత్ దేశాన్నే ఆకర్షిస్తున్నాయన్నారు. కేసీఆర్ సంపదను సృష్టిస్తూ.. ఆ సంపదను నేరుగా పేదల బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేస్తున్నారన్నారు. దీంతో లక్షల కోట్లు నేరుగా ప్రజలకు చేరాయని పేర్కొన్నారు. తెలంగాణ సాధించిన ప్రగతిపై రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో లేని బండి సంజయ్ దశాబ్ది ఉత్సవాలను కేసీఆర్ కుటుంబ ఉత్సవాలని అనడం ఆయన అవివేకమని మండిపడ్డారు. ఈ ప్రాంత ఎంపీతో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, పసుపు బోర్డు పేరుతో రైతులను నిండా ముంచిన బీజేపీని నమ్మే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు.
బీఆర్ఎస్లో చేరిక..
లక్కోర గ్రామానికి చెందిన బీజేపీ, బీఎస్పీ నాయకులు దాసరి అనిల్, సుభాష్ గౌడ్, చిన్న హన్మాండ్లు, వారి అనుచరులు, అమీనాపూర్ గ్రామానికి చెందిన బీఎస్పీ, బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరా రు. వారికి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
కేసీఆర్ సహకారంతోనే బాల్కొండ అభివృద్ధి..
సీఎం కేసీఆర్ సహకారంతో వేల కోట్లతో బాల్కొండ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. ఎండాకాలంలో కూడా చెరువులు, అలుగులు పారుతుండడంతో రైతులు సంతోషంగా ఉన్నారని గుర్తుచేశారు. ప్రతి గ్రామంలో కోట్ల రూపాయలతో జరిగిన అభివృద్ధి కండ్లకు కనిపిస్తున్నదన్నారు. ఈ అభివృద్ధిపై గ్రామా ల్లో చర్చజరిగేలా బీఆర్ఎస్ కుటుంబసభ్యులు చొరవ చూపాలన్నారు. వేల్పూర్ క్లస్టర్ గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, వంతెనలు, చెక్‌డ్యాములు, చెరువులు, కాలువలు, నవాబ్ లిఫ్ట్ ద్వారా చెరువులు నింపడం తదితర కార్యక్రమాలను వివరించారు. నియోజకవర్గ ప్రజలు రెండుసార్లు జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో తనను ఎమ్మెల్యేగా గెలిపించారని..వారి నమ్మకాన్ని నిలబెడుతూ వేలకోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి చేశానన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ మధుశేఖర్, పార్టీ మండల కన్వీనర్ నాగధర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అరుణ, ఎంపీపీ భీమ జమున, జడ్పీటీసీ అల్లకొండ భారతి, వైస్ ఎంపీపీ సురేశ్, ఆర్టీఏ సభ్యుడు రేగుళ్ల రాములు, బాల్కొండ పార్టీ సమన్వయ సమితి సభ్యుడు సామ మహిపాల్, సొసైటీ చైర్మన్ మోహన్‌రెడ్డి, వేల్పూర్ సొసైటీ ఉపాధ్యక్షుడు శ్రీధర్, సర్పంచులు,ఎంపీటీసీలు,గ్రామశాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
పేరుపేరునా పలుకరిస్తూ..
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి వేముల తన సతీమణి నీరజారెడ్డితో కలిసి పాల్గొన్నారు. వివిధ గ్రామాల పార్టీ శ్రేణులతో వేముల దంపతులు ఆప్యాయంగా మాట్లాడారు. కుటుంబ సమేతంగా వచ్చిన వారితో ఫొటోలు దిగారు. సమ్మేళన ప్రాంగణమంతా కలియ తిరుగుతూ అందరినీ పేరుపేరునా పలుకరిస్తూ ఆత్మీయతను చాటారు. కార్యక్రమానికి వచ్చిన వారికి వడ్డించి వారితో కలిసి భోజనాలు చేశారు. వేముల దంపతుల కలుపుగోలు తనంతో ప్రాంగణంలోని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. బీఆర్ఎస్ కుటుంబసభ్యులకు ఏ ఆపదొచ్చినా తోడుగా ఉంటానని భరోసా ఇవ్వడంతో కార్యకర్తలు సంతోషం వ్యక్తంచేశారు. అధినేత కేసీఆర్ పంపిన సందేశాన్ని మంత్రి వేముల చదివి వినిపించగా, సమ్మేళన ప్రాంగణమంతా జై కేసీఆర్, జైబీఆర్ఎస్, జై తెలంగాణ నినాదాలతో మార్మోగింది.