గ్రామీణ ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. సేవలను మరింత చేరువ చేసేందుకు పల్లె చెంతకే వైద్యం పేరుతో పల్లె దవాఖానలను ఏర్పాటు చేసింది. ఇక్కడ ఉచితంగా సేవలతోపాటు మందులు అందజేస్తున్నది. దీంతో గ్రామీణులకు దూరభారం తగ్గడంతోపాటు రూపాయి ఖర్చు లేకుండా సేవలందుతున్నాయి.
రామారెడ్డ్డి, ఫిబ్రవరి 24: ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభు త్వం కృషి చేస్తున్నది. వైద్య రంగానికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తున్నది. పల్లె దవాఖానలను ఏర్పాటు చేసి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని నియమించడంతోపాటు అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నది. దీంతో ప్రజలు పల్లె దవాఖానలో సేవలు పొందడానికి ఆసక్తి చూపుతున్నారు.
గ్రామీణులకు ఏదైనా రోగమొచ్చినా, జ్వరమొచ్చి నా.. గతంలో మండల కేంద్రంతోపాటు పలుచోట్ల ఉండే సబ్ సెంటర్ల వద్ద మాత్రమే వైద్య సేవలు అందేవి. అవి కూడా దూరంగా ఉండడంతో ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలంటే వ్యయ, ప్రయాసలు తప్పనిపరిస్థితి. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వైద్యరంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులతో గ్రామీణ ప్రజలకు పల్లె వైద్యం చేరువ చేసేలా దృష్టిసారించారు. సబ్ సెంటర్ల స్థానంలో కొత్తగా పల్లెదవాఖానలకు శ్రీకారం చుట్టారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 169 పల్లె దవాఖానలు, నాలుగు బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారు.
పల్లె దవాఖానలో అందే సేవలు
ఉచితంగా మందులు..
పల్లె దవాఖానల ఏర్పాటుతో గ్రామీణ ప్రజలు జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి వంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు పట్టణ ప్రాంతాలకు వెళ్లాల్సిన బాధ తప్పింది. రానున్న రోజుల్లో వీటిని 24 గంటల పాటు వైద్య సేవలు అందించేలా తీర్చిదిద్దే అవకాశం ఉన్నది. పల్లె దవాఖానల్లో వైద్యసేవలతోపాటు మందులను ఉచితంగా అందజేస్తున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే సమీపంలోని ప్రభుత్వ దవాఖానకు రిఫర్ చేస్తున్నారు. అవసరమైన వారికి తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సెంట్రల్ హబ్‌లో వివిధ రకాల పరీక్షలు కూడా చేయిస్తున్నారు.
సత్వర వైద్యం..
గతంలో సబ్సెంటర్లలో వైద్య సేవలు అందేవి. అందులో సరైన వసతులు, పరికరాలు ఉండేవి కాదు. రాష్ట్ర ప్రభుత్వం 5వేల జనాభా ఉన్న గ్రామాల్లో పల్లె దవాఖానలు ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటి వరకు జిల్లాలో 88 మంది డాక్టర్లను నియమించాం. కొన్ని మండలాల్లో సొంత భవనాలు నిర్మించాం. మరికొన్ని మంజూరయ్యాయి. పల్లె దవాఖానల ద్వారా ప్రజలకు సత్వరమే వైద్యం అందుతుంది. రోగాలను కూడా త్వరగా నిర్ధారించవచ్చు.
– డాక్టర్ లక్ష్మణ్‌సింగ్, జిల్లా వైద్యాధికారి, కామారెడ్డి
ఈ దవాఖాన బాగుంది..
మా ఊరిలో పల్లె దవాఖాన పెట్టిండ్రు. సర్ది, తలనొప్పి, జ్వరం వస్తే వెంటనే దవాఖానకు పోతున్నం. అక్కడ డాక్టర్ పరీక్ష చేసి మందులు ఇస్తుండు. పల్లె దవాఖాన సౌలత్ బాగున్నది.
– దేమె లింగం, కన్నాపూర్