లింగంపేట/ నాగిరెడ్డిపేట్, అక్టోబర్17: కొన్నిరోజులుగా అకాల వర్షం రైతులను ఆగమాగం చేస్తున్నది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో వర్షం కురుస్తుండడంతో కోతకు వచ్చిన పంట దెబ్బతినగా..కొన్నిచోట్ల ఆరబెట్టిన ధాన్యం తడిసిపోతున్నది. బుధవారం అర్ధరాత్రి, గురువారం కురిసిన వర్షానికి లింగంపేట, నాగిరెడ్డిపేట మండలాల్లోని పలు గ్రామాల్లో కలాల్లతోపాటు కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురువుతున్నారు. ధాన్యం తడవకుండా ఉండడానికి రైతులు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. పదిరోజుల క్రితం నుంచి కోతలు మొదలైనా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు.
కేంద్రాలు ప్రారంభించేనాటికి ధాన్యం ఆరుతుందని ఆశ పడిన రైతులకు వర్షం తీరని నష్టం కలిగిస్తున్నది. కొన్నిగ్రామాల్లో కేంద్రాలను ప్రారంభించినా కొనుగోలు ప్రక్రియలో జాప్యం నెలకొంటున్నది. దీంతో ఆరబెట్టిన ధాన్యం తడవకుండా రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లింగంపేట మండలంలోని శెట్పల్లి, పర్మళ్ల, భవానీపేట, ముంబాజీపేట, బోనాల్, మెంగారం, పోతాయిపల్లి, లింగంపల్లి, పోల్కంపేట, శెట్పల్లిసంగారెడ్డి తదితర గ్రామాల్లో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసినట్లు రైతులు తెలిపారు. అధికారులు వెంటనే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం ప్రారంభించాలని కోరుతున్నారు.