మోర్తాడ్/బాన్సువాడ (నిజాంసాగర్), ఆగస్టు 22 : ఎగువప్రాంతం నుంచి వరద కొనసాగుతుండడంతోపాటు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి దగ్గరగా చేరుకోవడంతో ఎస్సారెస్పీ 16గేట్లు ఎత్తి 49, 280 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 78వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు (80.5 టీఎంసీలు) కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 1090.7అడుగుల (79.263 టీఎంసీలు)నీటి నిల్వ ఉన్నది. ప్రాజెక్ట్ నుంచి 78,812 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతున్నది. 16గేట్ల ద్వారా 49,280 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 1500, వరద కాలువకు 20వేలు, కాకతీయ కాలువకు 6500, సరస్వతీ కాలువకు 500, లక్ష్మీ కాలువకు 150, మిషన్‌భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 651 క్యూసెక్కుల నీరు ఆవిరిరూపంలో వెళ్తున్నది.
ఎగువ ప్రాంతాల నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 40,289 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు. వరద గేట్ల ద్వారా 16, 574 క్యూసెక్కులు, ప్రధాన కాలువకు 1800 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నదని ఏఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టు నాలుగు గేట్ల ద్వారా 18, 374 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 1405 అడుగులు ( 17.802 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 1403 అడుగుల వద్ద (15 .006 టీఎంసీలు) నీరు నిల్వ ఉన్నట్లు నీటి పారుదలశాఖాధికారులు తెలిపారు.