నిజామాబాద్, మే 8, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంత్రివర్గ విస్తరణపై వస్తోన్న లీకులతో మరోసారి అధికార పార్టీలో అలజడి నెలకొంది. నామినేటెడ్ పదవులతో పాటుగా మంత్రి వర్గంలో చోటు కోసం ఎవరికి వారు ప్రయత్నాలు మరోసారి ముమ్మరం చేసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏ పదవి లేక డీలా పడ్డ నేతలంతా అగ్ర నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకు గింగిర్లు కొడుతున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పాకులాడుతున్నారు. ఉమ్మడి జిల్లాకు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో చోటు దక్కలేదు.
క్యాబినెట్ ర్యాంక్‌తో మంత్రివర్గ ఆహ్వానితుడిగా పి.సుదర్శన్ రెడ్డికి చోటు కల్పించినప్పటికీ అంతగా ప్రాధాన్యత దక్కడం లేదు. మంత్రి పదవికి ఉన్న క్రేజ్ ప్రభుత్వ సలహాదారు పదవికి దక్కకపోవడంతో మంత్రి యోగం కోసమే నేతలు పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. రెండున్నరేళ్లు దాటినప్పటికీ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై హస్తం పార్టీలో అసంతృప్తి రగులుతోంది. యోగ్యత లేక పక్కన పెడుతున్నారా? ఉమ్మడి జిల్లాపై చిన్నచూపా? అనే కోణంలో చర్చ నడుస్తోంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లాకు దక్కుతోన్న అప్రాధాన్యతపై ప్రజల్లోనూ ఒకింత అసంతృప్తి ఏర్పడింది.
ప్రజాపాలన పేరుతో పరిపాలన చేస్తోన్న కాంగ్రెస్ పార్టీకి ఇంటా బయటా అసంతృప్తి పెరుగుతోంది. ఓ వైపు ప్రజల్లో రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతుంటే… పార్టీలో సైతం పదవుల భర్తీలో లోటుపాట్లు తలపోటును తీసుకు వస్తోంది. పదవుల పరంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలకు తీరని అన్యాయమే జరుగుతోంది. పార్టీని నమ్ముకుని బతుకున్న తమకు సరైన గుర్తింపు దక్కడం లేదని సీనియర్ లీడర్లు నిట్టూరుస్తున్నారు.
పార్టీ పరమైన పదవుల్లోనూ చోటు లేక… ప్రభుత్వంలో భాగం కాలేక పోవడంతో అవమానంగా ఫీలవుతున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి నలుగురు ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సరైన స్థాయిలో పదవులు వరించడం లేదు. బాల్కొండ నియోజకవర్గంలో మానాల మోహన్ రెడ్డి, ఈరవత్రి అనిల్, అన్వేశ్ రెడ్డిలకు కీలకమైన కార్పొరేషన్ పదవులు దక్కాయి. ఉర్దూ అకాడమి ఛైర్మన్‌గా తాహెర్‌బిన్ హుందాన్కు పదవి వచ్చింది.
కామారెడ్డి జిల్లాలో కాసుల బాలరాజుకు పదవి వరించింది. పీసీసీ, డీసీసీ కార్యవర్గంలో పదవులు ఇచ్చినప్పటికీ పలువురు సంతృప్తి చెందడం లేదు. పార్టీ పదవులతో ఒరింగిదేమిటి? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుతో రాష్ట్ర, జిల్లా స్థాయి పదవులను చేపట్టిన నేతల పదవీకాలం త్వరలోనే ముగుస్తోంది. ఈ దఫా పొడిగింపు ఉంటుందా? లేదా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. పదవీకాలం పొడిగిస్తే అసంతృప్త నేతలతో గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావడంతో కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు. పొడిగించకపోతే పదవులు అనుభవిస్తోన్న సీనియర్ నేతలతో ముప్పు తప్పదనే ఆందోళన సైతం నెలకొన్నది.
మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు మరోసారి పెరగడంతో పదవుల పందెరంలో రోజుకోకరి పేరు వినిపిస్తోంది. ఆది నుంచి మంత్రి పదవి కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పి.సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, లక్ష్మీకాంతారావు, మదన్ మోహన్‌రావులు ప్రయత్నాలు చేశారు. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటే అందులో ముగ్గురు మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారున్నారు. వీరందరిలో సీనియారిటీ పరంగా సుదర్శన్ రెడ్డికి మెండు అవకాశాలున్నప్పటికీ రెడ్డి సామాజిక వర్గానికి ఇప్పటికే రేవంత్ రెడ్డి క్యాబినెట్లో పెద్ద పీట దక్కడం శాపంగా మారింది. దీంతో సుదర్శన్ రెడ్డిని చల్లబర్చేందుకు ప్రభుత్వ సలహాదారుగా క్యాబినెట్ మీటింగ్‌కు ప్రత్యేక ఆహ్వానితుడిగా అర్హత కల్పిస్తూ పదవిని కట్టబెట్టారు.
సామాజిక సమీకరణాల పేరుతో బోధన్ ఎమ్మెల్యేకు దురదృష్టం పట్టుకోగా తాజాగా మరోసారి ఆయన పేరు తెర మీదికి వస్తోంది. ఇప్పటికే కీలకమైన పదవిలో కొనసాగుతున్నందున బీసీ సామాజిక వర్గం నుంచి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు అదృష్టం వరించే వీలున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను పక్కన పెట్టి అదే సామాజిక వర్గానికి చెందిన పీసీసీ అధ్యక్షుడికి మంత్రి పదవి కట్టబెడతారని కాంగ్రెస్ వర్గీయుల్లో జోరుగా చర్చ నడుస్తోంది. కామారెడ్డి జిల్లాలో లక్ష్మీకాంతారావు, మదన్ మోహన్ రావులకు మంత్రి యోగం వస్తుందా? అంటే అందుకు బలం చేకూర్చే అంశాలు దొరకడం లేదు. మొదట్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే పేరు బలంగా వినిపించినప్పటికీ ఆ తర్వాత ప్రచారమే లేకుండా పోయింది