రుద్రూర్, ఆగస్టు 23 : ఎల్లవేళలా అభివృద్ధి కోసం ఆరాటపడే గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో దాదాపు రూ. 25కోట్ల నిధులతో 35 అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. మండల కార్యాలయాల సముదాయం, కేజీబీవీ భవనాలను ప్రారంభించడంతోపాటు కమ్యూనిటీ హాళ్లు, హెల్త్ సబ్ సెంటర్లు, రోడ్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు, ఆలయాల అభివృద్ధి కార్యక్రమాల్లో స్పీకర్ పాల్గొన్నారు. ముందుగా కస్తూర్బా గాంధీ పాఠశాల భవనాన్ని పరిశీలించి విద్యార్థినులతో కొంతసేపు ముచ్చటించారు. సమీకృత మండల కార్యాలయంలో తహసీల్దార్ వెంకటేశ్, ఎంపీడీవో బాలగంగాధర్, ఎంపీపీ అక్కపల్లి సుజాతా నాగేందర్‌ను కుర్చీలో కూర్బోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భవన సముదాయం వద్ద ఏర్పాటుచేసిన సభలో స్పీకర్ ప్రసంగించారు.
రుద్రూర్ గ్రామంలోనే దాదాపు 376 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించుకున్నామని, అన్నీ కలిపి రూ. 50కోట్లతో అభివృద్ధి పనులుచేపట్టామని స్పీకర్ తెలిపారు. వర్ని మండలం కోటయ్య క్యాంపులో బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీని నిర్మించనున్నట్లు చెప్పారు. రూ.కోట్ల నిధులతో నిర్మించిన కల్యాణ మండపాల్లో వంట సామగ్రిని ఏర్పాటు చేసి వినియోగంలోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను కోరారు. సీఎం కేసీఆర్.. ప్రజల కోసం తాపత్రయ పడతారని, అన్ని వర్గాలవారికి అందజేస్తున్న సంక్షేమ పథకాలే ఇందుకు నిదర్శనమని తెలిపారు. రైతుబంధు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. 15వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని, 13 లక్షల మంది ఆడబిడ్డల కోసం రూ. 10వేల కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. అందులో బాన్సువాడలో 14వేల మంది ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి వర్తించిందన్నారు. 11వేల డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించుకున్న ఘనత బాన్సువాడ నియోజకవర్గానికే దక్కిందన్నారు. సొంత జాగా ఉన్నవారు గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 26 లక్షల మంది ఉన్న పింఛన్ లబ్ధిదారుల సంఖ్య నేడు 46 లక్షలకు చేరిందని స్పీకర్ తెలిపారు. పక్క రాష్ర్టాల్లో 80 ఏండ్లు దాటితేనే రూ.400-600 పింఛన్ ఇస్తున్నారని, మన రాష్ట్రంలో దివ్యాంగులకు రూ.3016 నుంచి రూ.4016కు పెంచినట్లు చెప్పారు. దేశమంతా ధాన్యంకొరత ఉంటే మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కృషి, రైతన్నల శమ్రతో పంటలను ఎగుమతి చేసే స్థాయిలో ఉన్నామని చెప్పారు. అనంతరం టేకేదార్లతోపాటు ప్రభుత్వం దివ్యాంగులకు పెంచిన రూ.4016 పింఛన్లను పంపిణీ చేశారు. మండల అభివృద్ధికి కృషి చేస్తున్న జడ్పీటీసీ నారోజి గంగారాం, ఎంపీపీ సుజాతా నాగేందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, విండో మాజీ చైర్మన్ పత్తి రాములను స్పీకర్ అభినందించారు.
అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్బర్‌నగర్ నుంచి ద్విచక్రవాహనాలతో ర్యాలీ తీశారు. రుద్రూర్లో రామాలయం వద్ద మంగళహారుతులు, కేజీబీవీ వద్ద విద్యార్థినులకు మార్చ్‌ఫాస్ట్‌తో ఆహ్వానించారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఆర్డీవో రాజాగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, డీఆర్డీవో పీడీ చందర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.