బాన్సువాడ రూరల్/ కోటగిరి, సెప్టెంబర్ 25: సంక్షేమ పథకాలే ప్రభుత్వానికి అండగా ఉంటాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే కేసీఆర్ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. దేశంలో నంబర్‌వన్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. సోమవారం ఆయ న పొతంగల్ మండలం కొడిచెర్ల, బాన్సువాడ మండలం బోర్లం క్యాంపులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. బోర్లం క్యాంపులో 25 మంది డబుల్బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు సభల్లో స్పీకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అఖండ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.
సీఎం కేసీఆర్ దూర దృష్టితో రూ.85వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని తెలిపారు. కాళేశ్వరం నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి తీసుకొచ్చి రెండు పంటలకు సాగు నీరు అందిస్తున్నామని చెప్పారు. భవిష్యత్‌లో సాగు నీటికి ఎలాంటి ఢోకా లేదన్నారు. పేదలకు విద్య, వైద్యం పూర్తిస్థాయిలో అందాలనే సంకల్పంతో బాన్సువాడ నియోజకవర్గంలో దవాఖానలు, గురుకుల పాఠశాలల ఏర్పాటుకు కృషిచేసినట్లు తెలిపారు. చిన్న గ్రామంలో బోర్లం క్యాంపు తండాలో ఇప్పటి వరకు దాదాపు రూ. 7 కోట్లతో అభివృద్ధి పనులను చేసినట్లు చెప్పారు. ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న ప్రభుత్వాలను ఆదరించాలని కోరారు. తల్లి బాగుంటేనే.. బిడ్డ బాగుంటదన్నారు. గర్భిణిగా ఉన్నప్పుడే మంచి పౌష్టికాహారం తీసుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందజేస్తున్నారని తెలిపారు. ఆరోగ్యకరమైన సమాజమే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ఇతర రాష్ర్టాల కన్నా తెలంగాణలోనే వృద్ధాప్య పింఛన్ రూ.2016, దివ్యాంగులకు రూ. 4016 ఇస్తున్నట్లు తెలిపారు. మన రాష్ట్రంలో 46లక్షల పింఛన్లు ఇస్తున్నట్లు తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలో నాలుగు చెక్‌డ్యాంలు మంజూ రు కాగా రెండు చెక్‌డ్యాంల పనులు పూర్తయినట్లు చెప్పారు. మరో రెండు త్వరలో ప్రారంభం కానున్నాయని తెలిపారు. నిజాంసాగర్ నీటిని సుంకిని వరకు అందించాలనే ఉద్దేశంతో రూ. 22 కోట్లు వెచ్చించి సుద్దులం నుంచి సుంకిని వరకు కెనాల్‌కు సీసీ లైనింగ్ పనులు చేయించినట్లు చెప్పారు. అనంతరం కుర్మ సంఘం ఆధ్వర్యంలో సభాపతి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి, సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.