బీర్కూర్, ఏప్రిల్ 21: అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కేసీఆర్ ప్రభుత్వంతోపాటు తన కుటుంబంపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు ఓపికతో భరించామని, సహనానికి కూడా హద్దు ఉంటుందని, ఇక నుంచి కారుకూతలు కూస్తే ఊరుకునేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. బీర్కూర్ గ్రామశివారులోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం అథితిగృహంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడారు. 45 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఎంతోమంది ముఖ్యమంత్రుల వద్ద పనిచేశానని తెలిపారు.
అభివృద్ధి పనుల కోసం నిధుల మంజూరుకు నానా తంటాలు పడేవారమని గుర్తుచేశారు. తెలంగాణ సిద్ధించాక అడిగిన వెంటనే కల్పతరువుగా సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని, బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. దీనిని ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలు.. కాంగ్రెస్, బీజేపీ పాలిస్తున్న రాష్ర్టాల్లో ఎక్కడైనా జరిగినట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చే బాధ్యత తనదని, దానిని క్షేత్రస్థాయిలో ఒక్క రూపాయి సైతం దుర్వినియోగం కాకుండా ప్రజలకు అందేలా చూసే బాధ్యత నాయకులపై ఉందని స్పష్టం చేశారు. ఈ నెల 27న హైదరాబాద్లో పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నెల 25న బాన్సువాడలో పదివేల మందితో సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశానికి వచ్చే ముందు బీఆర్ఎస్ గద్దెను ఏర్పాటు చేసి పార్టీ జెండాను ఎగురవేసి రావాలని సూచించారు. సమావేశంలో అన్ని మండలాల ముఖ్య నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.