భోపాల్: ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఒక చిత్రంలో భార్య.. తన భర్తను కోటి రూపాయలకు ప్రియురాలికి అమ్మేస్తుంది. అచ్చం అలాంటి ఘటనే ఇప్పుడు భోపాల్లో చోటుచేసుకుంది. ఇందులో కూడా ఇద్దరు పిల్లల తల్లి తన భర్తను రూ.1.5 కోట్లకు మరో మహిళకు అప్పగించేసి పిల్లలతో హాయిగా వేరే చోటకు వెళ్లిపోయింది. ఈ ఒప్పందం న్యాయస్థానం సాక్షిగా జరగడం విశేషం. వివరాల్లోకి వెళితే.. భోపాల్లో 42 ఏండ్ల వ్యక్తికి 23 ఏండ్ల క్రితం పెండ్లయింది. వారికి ఇద్దరు ఆడపిల్లలు.
అయితే తన తండ్రి తన కార్యాలయంలో 54 ఏండ్ల మహిళతో సంబంధం పెట్టుకుని తమను నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ 16 ఏండ్ల వారి పెద్ద కుమార్తె ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసింది. కోర్టు భార్యాభర్తలు, అతని ప్రియురాలిని కౌన్సెలింగ్కు పిలిచింది. అయితే తాను ప్రియురాలితోనే ఉంటానని భర్త స్పష్టం చేశాడు. దీంతో తన భర్తను ప్రియురాలికి వదిలిపెట్టడానికి రూ.1.5 కోట్లు ఇవ్వాలని భార్య డిమాండ్ చేసింది. దీనికి ప్రియురాలు సై అనడంతో 23 ఏండ్ల వారి వివాహ బంధానికి తెరపడింది. ఆ భార్యకు ఒక డూప్లెక్స్ ఇంటితో పాటు 27 లక్షల నగదును ప్రియురాలు చెల్లించడంతో ఆమె తన ఇద్దరు పిల్లలతో అందులోకి మారిపోయేందుకు సిద్ధపడుతున్నది.