Sirikonda | సిరికొండ, ఏప్రిల్ 11 : విద్యతోనే సమాజ మార్పు సాధ్యమని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మెన్ తాహేర్ బీన్ హందాన్ అన్నారు. పూలే దృష్టిలో నిజమైన స్వాతంత్రం అంటే కేవలం రాజకీయ స్వేచ్ఛ కాదని సామాజిక స్వేచ్ఛ కూడా అని పేర్కొన్నారు. సిరికొండ మండలంలోని సత్య శోధక్ పాఠశాలలో మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు, సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో ఆయన శనివారం పాల్గొని పూలే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ సమాజ నిర్మాణం కోసం పూలే దంపతులు చేసిన సేవ మరువలేనిదని కొనియాడారు.
మహిళలు ఉన్నత స్థానంలో నిలవడానికి పూలే చేసిన కృషి ఎంతో ఉందని అన్నారు. బడుగు బలహీనవర్గా ఆశాజ్యోతి సమ సమాజ నిర్మాణానికి స్త్రీ అభ్యున్నతకు కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలేకు భారతరత్న ఇవ్వాలని భారతరత్న ఇచ్చినప్పుడే వారి సమాజానికి గౌరవం లభిస్తుందని దీనిని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం మన అందరి బాధ్యత అని అన్నారు. ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ పూలే చూపిన దారిలో నడవాలంటే ముందుగా మనలోని వివక్ష భావనాలను తొలగించుకోవాలని అన్నారు. సమానత్వం మానవత్వం అనే విలువలను మనమే ఆశ్రమంలో పెట్టాలన్నారు.
సమాజంలో సగభాగమైన స్త్రీలు నిరక్షరాస్తులుగా ఉండకూడదని తన సతీమణి సావిత్రిబాయి పాఠశాలకు పంపిన ఆదర్శమూర్తి ఫూలే అన్నారు. 1848లో పూణేలో బాలికల కొరకు మొదటి పాఠశాలను ప్రారంభించిన ఘనత పూలే దంపతులకు దక్కుతుందన్నారు. ఆ మహనీయుల ను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నర్సయ్య, బాలయ్య, సోల్మాన్, దేవేందర్, ప్రొఫెసర్ మాలిక్, బాల భాస్కర్ బి జి ఆర్ నారగోని, అడ్వకేట్ గోవర్ధన్ పాల్గొన్నారు.