– ఇష్టానుసారంగా కాంగ్రెస్ నాయకుడి ఫ్లెక్సీలు
– పట్టించుకోని కార్పొరేషన్, పోలీస్ అధికారులు
– వెల్లువెత్తుతున్న విమర్శలు
కొత్తగూడెం ప్రగతి మైదాన్, ఆగస్టు 4 : జిల్లా కేంద్రంలో పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతోంది. ప్రభుత్వ ఆస్తులు రాజకీయ నాయకుల పుట్టినరోజు ప్రచారాలకు వేదికగా మారుతున్నా పట్టించుకునే నాధులే కరువయ్యారు. కొత్తగూడెం నగరంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు తన పుట్టినరోజు ఫ్లెక్సీలను ఏకంగా ట్రాఫిక్ సిగ్నల్ లైట్ పోల్స్ కి, విద్యుత్ స్తంభాలకు కట్టడం వివాదాస్పదంగా మారింది. పుట్టినరోజు ముగిసినప్పటికీ ఇంకా ఆ ఫ్లెక్సీలు తొలగించక పోవడంపై ఇటు కార్పొరేషన్ అధికారులు, అటు పోలీస్ అధికారులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదరు నాయకుడు తన ఫ్లెక్సీలను ట్రాఫిక్ కి అంతరాయం కలిగించే విధంగా ఇష్టానుసారంగా కట్టించినప్పటికీ వాటిని తొలగించడంలో అధికారులు అలసత్వం వహించడం శోచనీయం. మరీ ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ సర్కిల్లో ఏర్పాటు చేసిన బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం చుట్టూ సైతం రాజకీయ నాయకులు, ఇతరులు ఇష్టానుసారంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం పరిపాటిగా మారింది.
జిల్లా కేంద్రంగా ఉన్న కొత్తగూడెం ప్రాంతం కార్పొరేషన్ గా ఏర్పడినప్పటికీ అభివృద్ధి మాట పక్కన పెడితే, నగరంలో అడ్డు అదుపు లేకుండా ట్రాఫిక్ కి అంతరాయం కలిగించే విధంగా విచ్చలవిడిగా ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేయడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రోడ్లు, డివైడర్ల పై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు కనీస చర్యలు తీసుకోకుండా, ఫ్లెక్సీలను నియంత్రించకుండా వదిలేయడం సరైన విధానం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సకాలంలో స్పందించి ఫ్లెక్సీలను తొలగించి, ఇకపై ఎవరు కూడా ఇలాంటి వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సిగ్నల్ లైట్సా.. బర్త్ డే పోల్సా ?