Teachers | ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యల పరిష్కారానికి దశలవారీ పోరాటం నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (USPC) నిర్ణయించింది. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో యూఎస్పీసీ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ నాయకులు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సమస్యలన్నీ విద్యారంగ సమస్యలేనని, వాటి పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విద్యా శాఖ అధికారుల వైఖరి వల్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు క్రమంగా మూతపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యా రంగానికి 15% నిధుల కేటాయింపు హామీని విస్మరించారని, నాణ్యమైన విద్య పేరుతో పాఠశాలల కుదింపునకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభిస్తున్నామని ఘనంగా ప్రకటించినప్పటికీ కేవలం యూకేజీ కే పరిమితం చేశారని, ప్రీ ప్రైమరీ తరగతులను మధ్యాహ్నం 12 గంటల వరకే నడపాలి. కానీ ప్రైవేటు పాఠశాలల్లో సాయంత్రం 4 వరకు ప్రీప్రైమరీ తరగతులు నడుస్తున్నాయని, ప్రభుత్వ పాఠశాలలకు పంపితే మధ్యాహ్నం 12 తర్వాత తమ పిల్లలను ఎవరు చూసుకుంటారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారని వారు వాపోయారు. ప్రాథమిక విద్యకు అవరోధంగా ఉన్న జీవో 25ను సవరించాలని కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఇద్దరు టీచర్లు, 50 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో తరగతికి ఒక టీచర్ను నియమించాలని డిమాండ్ చేశారు.
నూతన జిల్లాలకు డీఈవో, రెవెన్యూ డివిజన్ కు ఒక డిప్యూటీ ఈవో, అన్ని మండలాలకు ఎంఈవో పోస్టులు మంజూరు చేయాలని, పీవో 2018 కి అనుగుణంగా సర్వీసు నిబంధనలు రూపొందించి పర్యవేక్షణ అధికారుల పోస్టులు భర్తీ చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 15 లోగా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని, టెట్ లో సర్వీసు వెయిటేజీ ఇవ్వాలని, స్పెషల్ టెట్ ను సబ్జెక్టు వారీ పేపర్లతో నిర్వహించాలని, సీపీఎస్ రద్దు చేయాలని, మెమో 57 ప్రకారం 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ వర్తింపజేయాలని, విద్యా శాఖ లో బీసీ, గిరిజన గురుకులాల టైంటేబుల్ మార్చాలని, మోడల్, ఎయిడెడ్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేయాలని కోరారు.
కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్షా అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని, జీవో 317 బాధితులకు న్యాయం చేయాలని, జీవో 190 అమలు చేయాలని, 5 వాయిదాల కరువు భత్యం (DA), పీఆర్సీ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులను ప్రతినెలా రూ. 2000 కోట్ల చొప్పున విడుదల చేయాలని, హెల్త్ కార్డులు పూర్తి స్థాయిలో అమలుకు చొరవ తీసుకోవాలని సూచించారు. పై డిమాండ్ల పరిష్కారానికి దశలవారీ పోరాటాలు నిర్వహించాలని యూఎస్పీసీ నిర్ణయించింది. ఆగస్టు 7న నల్ల బ్యాడ్జీలతో పాఠశాలల్లో భోజన విరామ సమయంలో నిరసనలు, పీఆర్సీ ప్రకటించేదాకా ప్రతిరోజూ నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని యూఎస్పీసీ పిలుపునిచ్చింది. ఆగస్టు 12, 13 తేదీల్లో మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, తహసీల్దార్లకు మెమోరాండం, 19న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, 29న హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించారు.
అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే సెప్టెంబర్లో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వేలాది మంది ఉపాధ్యాయులతో చలో అసెంబ్లీ నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. అన్ని సంఘాలు ఐక్య పోరాటాలకు కలిసి రావాలని, ఉపాధ్యాయులు అందరూ సంఘాలకు అతీతంగా సమస్యల పరిష్కారం కోసం ఈ పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చావ రవి, ఏ వెంకట్(టీఎస్ యూటీఎఫ్), సీహెచ్ అనీల్ కుమార్, ఎన్ తిరుపతి(టీపీటీఎఫ్), ఎం సోమయ్య, టీ లింగారెడ్డి(డీటీఎఫ్), కొమ్ము రమేష్ (బీటీఎఫ్), మేడి చరణ్ దాస్ (ఎస్సీ, ఎస్టీ టీఎఫ్), ఎస్ హరికిషన్ (టీటీఏ), బీ కొండయ్య (ఎంఎస్టీఎఫ్), వై విజయ కుమార్, రవీందర్ (ఎస్సీ, ఎస్టీ యూఎస్) పాల్గొన్నారు.