ఆర్మూర్‌టౌన్, జనవరి 23: కాంగ్రెస్ ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి స్పష్టంచేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆర్మూర్ పట్టణంలోని కెనాల్ బ్రిడ్జి వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను శుక్రవారం దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డితో పాటు పార్టీ నాయకుడు సన్మాన్ పాల్గొన్నారు.
అనంతరం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ..అవకాశవాద, అవినీతికర, దగా కోరు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు. తెలంగాణ సాధించిన ఉద్యమ యోధులపై ఇన్ని కక్ష సాధింపు చర్యలా అని మండిపడ్డారు. సిట్ విచారణ పేరుతో కాంగ్రెస్ సర్కార్ సాగిస్తున్న అరాచకాలను సాగనివ్వబోమని, కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు జోలికొస్తే తెలంగాణ అగ్నిగుండమే అని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. రేవంత్ రెడ్డి రాక్షస సర్కార్‌పై ప్రజలతో కలిసి తిరగబడతామని హెచ్చరించారు.
రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కాదని, ఎమర్జెన్సీ రాజ్యమని ఆగ్రహం వ్యక్తంచేశారు.కాల్చివేత్తలు, కూల్చివేతలు, పేల్చివేతలు కాంగ్రెస్ సర్కార్ అవారా లక్షణాలు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అంటేనే స్కాముల పార్టీ అని విమర్శించారు. ఏ టూ జడ్ కుంభకోణాలు కాంగ్రెస్ ఘనకార్యాలని, పంచభూతాలను భోంచేసిన అవినీతి చరిత్ర ఆ పార్టీకి ఉన్నదని పేర్కొన్నారు. ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ బొగ్గు కుంభకోణం వెలుగు చూసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బావమరిది సృజన్ రెడ్డి అవినీతి బాగోతాలను కప్పి పుచ్చేందుకే రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
సిట్ పేరుతో కేటీఆర్, హరీశ్‌రావు, బీఆర్ఎస్ నేతలను విచారణకు పిలవడం రాజ్యాంగం మీద దాడిగా, వ్యక్తిత్వ హననంగా జీవన్ రెడ్డి అభివర్ణించారు. కేటీఆర్ విషయంలో పదే పదే దుష్ప్రచారం చేయడం, తప్పుడు లీకులను ప్రచారంలోకి తేవడం సిగ్గు చేటన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జీవన్ రెడ్డి సమక్షంలో మైనార్టీ యువకులు బీఆర్ఎస్లో చేరగా, వారికి గులాబీ కండువా పార్టీలోకి ఆహ్వానించారు.