నిజామాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అధికార కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకం చిచ్చు రేపుతున్నది. బజారున పడి పదవుల కోసం కొట్లాడుకునే దుస్థితికి వచ్చింది. పార్టీలో నువ్వా నేనా అన్నట్లుగా పలువురు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణతో కాంగ్రెస్ పార్టీలో అంటుకున్న అసంతృప్తి సెగ.. ఇప్పుడు పీసీసీ కార్యవర్గం కూర్పుతో మరింత పెరిగింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పదవుల సెగ రోజు రోజుకూ ఎక్కువ అవుతోంది. క్యాబినెట్లో బెర్త్ దక్కకపోవడంతో ఇప్పటికే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధిష్టానం తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బోధన్ నియోజకవర్గంలోని ఆయన అనుచరులు ఒక అడుగు ముందుకేసి రాజీనామా అస్ర్తాలను సంధించారు. మంత్రి పదవి ఇవ్వాలంటూ మంగళవారం వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన కూడా తెలిపారు. సోమవారం విడుదల చేసిన పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల నియామకాల్లోనూ పలువురు నేతలకు మొం డి చేయి దక్కడంతో సీనియర్లు గుర్రుమంటున్నారు. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని పని చేస్తున్న వారిని కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఇలాఖాలోనూ విభిన్నమైన పరిస్థితి దాపురించడం గమనార్హం. నిజామాబాద్ జిల్లాకు ఒకరిద్దరు మినహా సీనియర్ నాయకులెవరికీ పీసీసీ కార్యవర్గంలో పదవుల్లేవు. జిల్లా నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉండడంతో ప్రధాన కార్యదర్శి పదవిని రాంభూపాల్‌కు కట్టబెట్టారు. కామారెడ్డి జిల్లాలో ప్రధాన కార్యదర్శులుగా ఇంద్రకరణ్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డికి కేటాయించగా వీరు ఒకే నియోజకవర్గానికి చెందిన వారు కావడం గమనార్హం.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో హస్తం పార్టీ రాజకీయం రసకందాయంలో పడింది. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి పీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి వరించింది. ఈ హఠాత్పరిణామంతో కాంగ్రెస్ వర్గీయుల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతున్నది. కామారెడ్డి కాంగ్రెస్‌కు కంచుకోటగా భావించే షబ్బీర్ అలీ వర్గీయులకు మింగుడు పడడం లేదు. మైనార్టీ కోటాలో మంత్రి పదవి ఆశించి భంగపాటుకు గురైన షబ్బీర్ అలీ తాజాగా పీసీసీ పోస్టుల భర్తీతో అవాక్కయ్యారు. ప్రభుత్వ సలహాదారుగా పోస్ట్‌తో కాలం వెళ్లదీస్తున్నప్పటికీ ఉమ్మడి జిల్లాలో సీనియర్ లీడర్‌గా, మైనార్టీ నేతగా మంత్రి పదవిని ఆశించినా ఫలితం లేకుండా పోయింది. భవిష్యత్తులో కామారెడ్డి రాజకీయాల్లో తన వారసుడిని రంగంలోకి దింపాలని కలలు కంటుండగా..షబ్బీర్‌కు పోటీగా కీలక పోస్టుల్లో ఇతర నేతలకు పదవులు వరించడంపై చర్చ జరుగుతోంది. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఇందూప్రియ భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి పీసీసీ జనరల్ సెక్రటరీ పదవి కట్టబెట్టడం వెనుక అధిష్టానానికి వేరే ఉద్దేశాలు ఉన్నట్లుగా పలువురు మాట్లాడుకుంటున్నారు. సరిగ్గా ఏడాదిన్నర క్రితం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న వ్యక్తికి పార్టీ పదవి ఇవ్వడంతో కామారెడ్డి హస్తంలో రచ్చకు దారితీస్తోంది. పార్టీని నమ్ముకుని పని చేస్తున్న వారిని పక్కన పెట్టి నిన్న కాక మొన్న పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఎలా ఇస్తారంటూ మండిపడుతున్నారు. ద్వితీయ శ్రేణి నాయకత్వం తీవ్రస్థాయిలో అసంతృప్తిని వెళ్లగక్కుతున్నది.
అసంతృప్తితో రగిలిపోతున్న కాంగ్రెస్ శ్రేణులు తాజా పరిణామాల నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమా చారం. బోధన్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి రాకపోవడంతో రాజీనామా అస్ర్తాలను సంధించినట్లు పార్టీ పదవుల పంపకంలో జరిగిన అన్యాయంపై తీవ్రంగా స్పందించాలని పలువురు యోచిస్తున్నట్లు తెలిసింది. అవసరమైతే పార్టీకి రాజీనామాలు సమర్పించాలని పలువురు భావిస్తున్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వివిధ కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీలో ఒక్కొక్కరికీ రెండేసి పదవులను కట్టబెట్టిన అధిష్టానం.. ఏ పదవి లేని వారిని విస్మరించడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. పీసీసీ ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పోస్టుల భర్తీలోనూ సీనియర్లను పట్టించుకోకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 9 నియోజకవర్గాలుంటే కేవలం కామారెడ్డి, నిజామాబాద్ నియోజకవర్గాల వారికే పదవులు వచ్చినట్లుగా తెలుస్తోంది. మిగిలిన నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలు కొందరు పదవులను ఆశించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట పీసీసీ రాష్ట్ర స్థాయి పదవులు రాకపోవడానికి ఎవరైనా చక్రం తిప్పారా? అడ్డు పుల్లలు వేశారా? అనే చర్చ జోరుగా సాగుతున్నది.
బోధన్, జూన్ 10: బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించనందుకు నిరసన తెలుపుతూ, వెంటనే ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్‌చేస్తూ పట్టణంలోని బసవతారక్‌నగర్‌లో ఉన్న వాటర్ ట్యాంక్‌ను యువజన కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఎక్కి హల్చల్ చేశారు. సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వనందుకు తాము నిరసనగా ట్యాంక్ ఎక్కామని, ఇప్పటికైనా ఆయనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇవ్వకపోతే తాము పైనుంచి కిందికి దూకుతామని పలువురు కాంగ్రెస్ నాయకులకు సెల్ఫోన్లో హెచ్చరికలు పంపారు. దీనిపై సమా చారం అందుకున్న పోలీసులు వెంటనే వాటర్ ట్యాంక్ వద్దకు చేరుకుని వారిని కిందికి దిగాల్సిందిగా కోరారు. సుమారు గంట పాటు హల్చల్ చేసిన కాంగ్రెస్ యువ నాయకులు పార్టీ సీనియర్ నాయకుడు పాషా మొయినుద్దీన్, మరికొందరి జోక్యంతో తమ ఆందోళనను విర మించుకున్నారు. యువజన కాంగ్రెస్ నాయకుల నిరసనను తాము పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్, ఇతర పెద్దల దృష్టికి తీసుకెళ్లామని, తొందపడవద్దని వారు నచ్చజెప్పారు. ట్యాంక్ ఎక్కిన వారిలో యువజన కాం గ్రెస్ బోధన్ పట్టణ అధ్యక్షుడు తలారి నవీన్ కుమార్, భూమేశ్, అహ్మద్, నజీర్, రాజు తదితరులు ఉన్నారు.