IND vs USA : డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు పొట్టి ప్రపంచకప్‌లో బోణీ కొట్టింది. వాంఖడేలో యూఎస్ఏ బౌలర్ల విజృంభణతో టాపార్డర్, మిడిలార్డర్ కుప్పకూలినా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(84 నాటౌట్) ఒంటరి సైనికుడిలా పోరాడి భారీ స్కోర్ అందించాడు. తనమార్క్ విధ్వంసంతో మెరుపు అర్ధ శతకం బాదిన అతడి శ్రమను బౌలర్లు సిరాజ్(3-29), అర్ష్దీపన్ సింగ్(2-18), అక్షర్ పటేల్ (2-24) వృథా చేయలేదు. 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన అమెరికా.. ఏ దశలోనూ ప్రత్యర్థి లక్ష్యం దిశగా సాగలేదు. 29 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్ పాయింట్ల ఖాతా తెరిచింది.
స్వదేశంలో జరుగుతున్న పొట్టి ప్రపంచకప్‌లో అమెరికా ముప్పును గొప్పగా ఆధిగమించింది టీమిండియా. ప్రధాన ఆటగాళ్లంతా చేతులెత్తేసిన వేళ.. నేనున్నానంటూ సూర్యకుమార్ యాదవ్(84 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఒకేఒక్కడి పోరాటంతో గౌరవప్రదమైన స్కోర్ చేసిన భారత్.. అనంతరం బౌలర్ల జోరుతో యూఎస్ఏను 132కే కట్టడి చేసి విజయఢంకా మోగించింది.
A valiant effort from USA, but India manage to cling on 💪 pic.twitter.com/PAqqvlOQrh
— ESPNcricinfo (@ESPNcricinfo) February 7, 2026
టీ20 ప్రపంచకప్ తొలి పోరులో భారత బౌలర్లు రెచ్చిపోయారు. వాంఖడేలో సిరాజ్(3-29), అర్ష్‌దీప్ సింగ్(2-18)లు వికెట్ల వేటతో యూఎస్ఏ బ్యాటర్లను హడలెత్తించారు. పవర్ ప్లేలోనే వీరిద్దరి పేస్ పంజాకు ప్రత్యర్థి కీలక వికెట్లు కోల్పోయింది. తన రెండో ఓవర్లోనే సిరాజ్ ఓపెనర్ అండ్రీస్ గౌస్(6)ను ఔట్ చేసి బ్రేకివ్వగా.. అర్ష్‌దీప్ ఓవర్లో మొనాంక్ పటేల్(0) శివం దూబే చేతికి చిక్కాడు. కాసేపటికే సాయితేజ ముక్కనపల్లి(2)ని సిరాజ్ ఔట్ చేసి మూడో వికెట్ అందించాడు. అంతే.. 13 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది అమెరికా.
A successful powerplay 🙌#TeamIndia pick 3⃣ wickets 👏
Updates ▶️ https://t.co/Rlm2ARPVEt#MenInBlue | #T20WorldCup | #INDvUSA pic.twitter.com/ARA9DrRjbt
— BCCI (@BCCI) February 7, 2026
ఆ తర్వాత మిలింద్ కుమార్(34), సంజయ్ కృష్ణమూర్తి(37)లు క్రీజునంటుకుపోయారు. భారత బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ నాలుగో వికెట్‌కు 58 రన్స్ జోడించిన మిలింద్‌ను వరణ్ ఓవర్లో ఇషాన్ స్టంపౌట్ చేశాడు. అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీయడంతో.. ప్రత్యర్థి ఓటమి ఖాయమైంది. ఆఖర్లో శుభం రంజనే (37) మెరుపులు మెరిపించినా సరిపోలేదు. ఆరంభంలో తడబడినా.. సూర్య కుమార్ అర్ధ శతకంతో పుంజుకున్న భారత్.. బౌలర్ల కృషితో 29 పరుగుల తేడాతో గెలుపొందింది.
తొలి పోరులో సూర్యకుమార్ యాదవ్(84 నాటౌట్) ప్రచండ సూర్యుడిలా ప్రతాపం చూపించాడు. వాంఖడేలో యూఎస్ఏ బౌలర్ల జోరుతో సహచరులు ఆడలేక ఔటైన చోట తానొక్కడే నిలబడి జట్టుకు ఊహించనంత స్కోర్ అందించాడు. వాన్ స్కాల్క్విక్(4-25) ఊహించని దెబ్బకొట్టగా 72కే సగం వికెట్లు పడినా.. పవర్ హిట్టర్ల నుంచి సహకారం అందకున్నా ఒంటరి సైనికుడులా చెలరేగాడు సూర్య. ఆఖరి ఓవర్లో.. 4, 6, 6, 4తో జట్టు స్కోర్‌కు 160 దాటించాడు సూర్య.
సూర్యకుమార్ యాదవ్(84 నాటౌట్)
పవర్ ప్లే చివరి ఓవర్ రెండో బంతికే ఇషాన్‌ను బోల్తా కొట్టించిన స్కాల్క్విక్.. ఆ తర్వాత తిలక్ వర్మను ఊరించే బంతితో పెవిలియన్ చేర్చాడు. సిక్సర్ల శివం దూబే (0) సైతం బంతిని ఆడాలా? వద్దా అనుకుంటూ ఆడి నేత్రవల్కర్ చేతికి చిక్కాడు. చూస్తుండగానే నాలుగు వికెట్లు పడడంతో స్టేడియమంతా నిశబ్దంగా మారింది. రింకూ సింగ్(6), హార్దిక్ పాండ్యా(5)లు సైతం తేలిపోగా.. అక్షర్ పటేల్(14) అండతో సూర్య సమయోచిత ఇన్నింగ్స్ ఆడాడు. 15వ ఓవర్ తర్వాత రెచ్చిపోయిన కెప్టెన్ తనమార్క్ షాట్లతో అలరించాడు.16వ ఓవర్లో మూడు ఫోర్లు, సిక్సర్‌తో 21 రన్స్ పిండుకున్న మిస్టర్ 360 .. ఆఫ్‌సైడ్ సంధించిన బంతులను లెగ్‌సైడ్ బౌండరీ తరలించి యూఎస్ఏ బౌలర్లను ఆశ్చర్యపరిచాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో వరుసగా 4, 6, 6, 4 బాది ప్రత్యర్థికి 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలకమయ్యాడు టీమిండియా సారథి.