నిజామాబాద్, జూలై 11, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గతేడాది కాలంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లా సరిహద్దు అడవుల్లో రెండు పెద్ద పులులు ప్రవేశించి సంచరించాయి. మొదటి పులి జూలై 2025లో గుర్తించారు. దీనికి ఎస్12గా నామకరణం చేశారు. ఇది మంచిర్యాల – కవ్వాల్ నుంచి వచ్చి సిరికొండ, రామారెడ్డి ప్రాంతాల్లో కొంతకాలం తిరిగి కనిపించకుండా పోయింది. రెండో పులి నవంబర్ 2025 నుంచి సంచరించింది. మహారాష్ట్ర తాడోబా నుంచి వచ్చిన ఈ యువ మగ పులి వయసు మూడున్నరేళ్లుగా అటవీ శాఖ అధికారులు చెప్పారు.
అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్లా, సిద్ధిపేట, యాదాద్రి, కరీంనగర్, పెద్దపల్లి ఇలా దాదాపుగా డజన్‌కు పైగా జిల్లాల్లో చుట్టేసింది. ప్రజలను అటవీ శాఖ అధికారులను అల్లాడించింది. ఈ పులి ఏప్రిల్ 2026 మధ్య కాలంలో నిజామాబాద్ జిల్లా భీంగల్‌లో పశువుపై దాడి చేసిన తర్వాత జాడ లేదు. రెండు నెలలుగా ఎలాంటి అలజడి లేదు. అటవీ అధికారులు దీనిని గమనిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆనవాళ్లు మాత్రం గుర్తించడం లేదు. కొందరు సమాచారం ప్రకారం వేటగాళ్ల ఉచ్చులో చిక్కి మరణించి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు గోదావరి నదిని దాటుకుని వచ్చిన మార్గంలోనే వెనక్కి మహారాష్ట్ర వైపు వెళ్లి ఉండొచ్చని అంటున్నారు. అధికారికంగా ఇంకా కచ్చితమైన సమాచారం రాలేదు.
రెండు పెద్ద పులులు సంచరించిన సమయంలో వికాస్ మీనా, బోగ నిఖితలు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు అటవీ శాఖ అధికారులుగా పని చేశారు. కానిప్పుడు వీరి స్థానంలో కొత్త అధికారులు వచ్చారు. వీరి నేతృత్వంలోనైనా పెద్ద పులులకు రక్షణ లభిస్తుందని అంతా ఆశిస్తున్నారు. కనీసం పులి జాడ ఎక్కుడుందో? అధికారిక సమాచారమైన వస్తుందని పర్యావరణ వేత్తలు భావిస్తున్నారు. ఎస్12 జాడ కనుమరుగైన తర్వాత జె1 పెద్ద పులి బతికి ఉందా? అనే ప్రశ్నకు అనేక అనుమానాలు వెలుగు చూస్తున్న సందర్భంలో అటవీ శాఖ ఏమని సమాధానం చెబుతుందో? అన్న ఉత్కంఠ అందరిలోనూ ఏర్పడింది. ఏకంగా రెండు పెద్ద పులులు వరుసగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లా అడవుల్లోనే కనిపించకపోవడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.
పులుల రాక సామాన్యమైన విషయమేమీ కాదు. మన అడవుల్లోకి చొచ్చుకుని రావడమంటే అదొక అద్భుతంగానే చెప్పుకుంటారు. అలాంటి అవకాశాన్ని అటవీ శాఖ వదులుకుంది. అడవి సంరక్షణకు పెద్ద పులి చేసే సాయం అంతా ఇంతా కాదు. పులి ఉందంటే అడవుల నరికివేత తగ్గుతుంది. వేటగాళ్ల అలజడి మాయమై పోతుంది. పెద్ద పులితో అడవిలో జంతువుల సంఖ్యలో సమతుల్యత సైతం ఏర్పడుతుంది. ఏడాదిన్నర కాలంగా పెద్ద పులులు వరుస కట్టుకుని నిజామాబాద్ మీదుగా కామారెడ్డి అడవుల్లోకి రావడం. ఆ తర్వాత మాయమై పోవడం అన్నది ఎవ్వరికీ అర్థం కావడం లేదు.
ఎస్12 పులి అప్పట్లో అలజడి సృష్టించింది. అకస్మాత్తుగా ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా పులి జాడ అన్నదే లేకుండా పోయింది. ఆ తర్వాత అటవీ శాఖ అధికారులు చేతులు దులుపుకుని ఎస్12 పులి సంచారానికి సంబంధించిన విషయాలే వెల్లడించలేదు. తాజాగా మరో పులి అదే మార్గంలో మన అడవుల్లోకి వచ్చి అంతర్ధానమై పోవడం ఆందోళన కలిగిస్తోంది. జె1గా వ్యవహరిస్తోన్న రెండో పులి ఏకంగా రెండు నెలలకు పైగా కనిపించకపోవడం పర్యావరణ వేత్తలను, జంతు ప్రేమికులను కలవరానికి గురి చేస్తోంది. వేటగాళ్ల ఉచ్చులో చిక్కి చనిపోయిందా? లేదా గోదావరి నది దాటుకుని వచ్చిన దారుల్లోనే వెనక్కి వెళ్లిందా? అంటే అస్సలు ఆధారాలే చిక్కడం లేదు.
పులి రావడంతోనే నిజామాబాద్, కామారెడ్డి అడవుల్లో సంబంధిత అధికారులు అప్రమత్తం అయ్యారు. సరిహద్దు జిల్లాలోకి పులి ప్రవేశించడంతో అనేక జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. దారి పొడవునా మైదాన ప్రాంతాల్లో పులి సంచారాన్ని, ప్రతి కదలికలను అటవీ శాఖ పసిగడుతూ వచ్చింది. 2026 ప్రారంభంలో ట్రాక్ కెమెరాలు ఏర్పాటుతో పాటుగా నైట్ విజన్ కలిగిన కెమెరాలను సైతం అడవుల్లో నిక్షిప్తం చేశారు. థర్మల్ కెమెరాలు కలిగిన డ్రోన్లతోనూ గస్తీ పెట్టారు. అయినప్పటికీ పులి జాడ ఒక్కసారిగా ఉన్నట్టుండి కనిపించకపోవడం అన్నది అంతు చిక్కడం లేదు. ఈ వ్యవహారంపై మే 11న “కనిపించని పెద్దపులి? అనే శీర్షికతో “నమస్తే తెలంగాణ”లో కథనం వచ్చింది.
ఆ సమయంలో పీసీసీఎఫ్ ఆదేశాలతో కొన్ని రోజుల పాటు అడవుల్లో సెర్చ్ ఆపరేషన్ చేసి అటవీ శాఖ అధికారులు చేతులు దులుపుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు వెళ్లి తిరిగి కామారెడ్డికి పులి వచ్చిన సందర్భంలోనూ ఫిబ్రవరి 27న “టైగర్ రిటర్న్” కథనంతోనూ అటవీ శాఖను అప్రమత్తం చేయాల్సి వచ్చింది. 2025, డిసెంబర్ 17న “బాబోయ్ మరో పులి వచ్చిందంటూ”… ఎస్12 జాడను, కొత్త పులి భద్రతను ఎత్తి చూపుతూ ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైంది. అడుగడుగునా “నమస్తే తెలంగాణ” కథనాలతో అటవీ శాఖను అప్రమత్తం చేసినప్పటికీ కొంత మంది అధికారులు నిద్రమత్తును వీడలేదు. చివరకు రెండు పులుల జాడపై ఎలాంటి సమాచారం లేకుండా పోయింది.