నిజామాబాద్, ఏప్రిల్ 4, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అధికార కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త రాగాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పదవుల కోసం ఎదురు చూస్తున్న నేతలకు భంగపాటు తప్పకపోవడంతో ముఖ్య నేతలపై నిట్టూరుస్తున్నారు. బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై నిప్పులు చెరుగుతున్నారు. వర్గాలుగా విడిపోయిన నేతలంతా ఎవరికి వారు పదవుల కోసం చాలా రోజుల నుంచి పైరవీలు చేసుకుంటున్నారు. పదవుల కోసం అర్రులు చాచిన నేతలకు పార్టీ పదవులు దక్కాయి. పార్టీ పదవులు చేపట్టిన నేతల్లోనూ అంసతృప్తి రగులుతోంది.
ప్రభుత్వంలోనే కీలకమైన పోస్టులు అప్పగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో అధిష్టానం వీరి మొర వినకపోవడంతో కొంత మంది నేతలు బహిరంగంగానే తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. కొందరైతే ఒకడుగు ముందుకేసి ఫ్లెక్సీ రాజకీయాలకు తెర లేపారు. ఓ నేత పేరిట నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు కావడంతో హస్తం పార్టీలో దుమారం రేపుతోంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లాలో పదవుల కోసం జరుగుతోన్న తంతుపై సర్వత్రా విస్మయం ఏర్పడింది. ప్రభుత్వంలో పదవులు చేపట్టేందుకు ఉమ్మడి జిల్లా నేతలకు సమర్ధత లేదా? అని నిలదీస్తున్నారు. అర్హతలు ఉన్నప్పటికీ పదవులు కట్టబెట్టకపోవడానికి కారణాలు ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు.
ఎమ్మెల్యేలకు తోడుగా సీనియర్ లీడర్లు పార్టీ తీరుపై భగ్గుమంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా రెండున్నరేళ్ల కాలమే మిగిలి ఉంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పగటి కలగానే మారనుంది. మిగిలిన కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పదవులు వరించడం లేదు. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పోస్టులు ఆశించిన వారికి తీపి కబురు రాకపోవడంతో అసంతృత్తితో కొట్టుమిట్టాడుతున్నారు.
పదవుల పంపకాలపై నేడు, రేపు అంటూ కాలం గడుపుతుండడంతో జీర్ణించుకోలేక పోతున్నారు. ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకోవడానికి వారి పేరిట ప్రకటనలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. జేబులు ఖాళీ అవుతున్నప్పటికీ ఆశించిన గౌరవం దక్కకపోవడంతో నేతలంతా గుర్రుమంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో అనేకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి పార్టీలు మారకుండానే నిబద్ధతతో కొనసాగుతున్నారు. గతంలో పార్టీ మారేందుకు అవకాశాలు వచ్చినప్పటికీ కండువా మార్చలేదు.
కానిప్పుడు గోడ దూకి వచ్చిన వారికే అగ్ర తాంబూలం దక్కుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ మారిన లీడర్లకు మొన్న నగరపాలక, పురపాలక ఎన్నికల్లో కార్పొరేటర్, కౌన్సిలర్ సీట్లు దక్కించుకోవడంతో పాత నేతలకు మింగుడు పడడం లేదు. పార్టీలు మార్చినోడికే ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటి? అని నిలదీస్తున్నారు. ఫలితంగా వర్గ విభేదాలు రోజురోజుకు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా ఓ మాజీ ప్రజా ప్రతినిధి పేరిట వెలిసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశం అవుతున్నాయి. పార్టీ కోసం పని చేస్తే పదవులు ఇవ్వరా? అంటూ నిలదీయడం కాంగ్రెస్ పార్టీలో గందరగోళానికి, అసంతృప్తికి అద్దం పడుతోంది.
రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చోటు కరువైంది. ప్రభుత్వం ఏర్పాటు నుంచి నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా ప్రయత్నాలు చేసినప్పటికీ సీనియర్, జూనియర్ ఎమ్మెల్యేలకు మంత్రి యోగం దక్కలేదు. పి.సుదర్శన్ రెడ్డికి క్యాబినెట్ ర్యాంక్‌తో ప్రభుత్వ సలహాదారుగా నియమించి చేతులు దులుపుకున్నారు.
ఫలితంగా ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి లేకపోవడంతో ప్రభుత్వంలో చక్రం తిప్పే లీడరే కరువయ్యారు. తెలంగాణలో తొలిసారి ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి పి.సుదర్శన్ రెడ్డి, రేకులపల్లి భూపతి రెడ్డి, మదన్ మోహన్ రావు, లక్ష్మీకాంతారావులు ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బడ్జెట్ సమావేశాల సమయంలో శాసన మండలి, శాసన సభలో ప్రభుత్వ విప్‌లుగా పలువురిని ప్రభుత్వం నియమించింది. క్యాబినెట్ ర్యాంక్ కలిగిన ఈ పదవుల్లోనూ ఉమ్మడి జిల్లాకు మోసమే మిగిలింది. ఎమ్మెల్యేలకు విప్ పదవులు దక్కలేదు.
ఆది నుంచి మంత్రి పదవి లేక, విప్‌లుగా నియామకం జరగక అడుగడుగునా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఢోకా జరుగుతోంది. కొత్త ప్రభుత్వాలు ఏర్పాటైన తర్వాత అసెంబ్లీ స్థాయి సంఘాల నియామకం చేపట్టడం ఆనవాయితి. సభా సంఘాల కూర్పు లేకపోవడంతో కనీసం అందులోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కనీసం చోటు లేకుండా పోయింది. బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు పదవిని మినహాయిస్తే మంత్రి యోగం, విప్ పదవులు, నామినేటెడ్ హోదా కలిగిన పోస్టులు లేక మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది.