మహబూబ్‌నగర్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): శ్రీశైలం జలాశయం 162 టీఎంసీలకు చేరినా రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదీ జలాలను పాలమూరు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా పూర్తిస్థాయిలో ఎందుకు ఎత్తిపోయడం లేదని మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సీ లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి ప్రశ్నించారు. సర్కార్ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ శుక్రవారం వారు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 11లోగా పంపులు ప్రారంభించి ఇటు నార్లాపూర్, అటు కల్వకుర్తి నుంచి చివరి ఆయకట్టు వరకు కాలువలకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున రైతులతో కలిసి ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
శ్రీశైలం జలాశయం నిండుతున్నా రైతులకు నీళ్లు ఇవ్వాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, మల్యాల పంప్‌హౌస్ ద్వారా ఏపీ వేలాది క్యూసెక్కుల నీటిని తరలించుకుంటుంటే, తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నుంచి నీటిని ఎత్తిపోయకుండా చేతులు ముడుచుకొని కూర్చోవడం సరికాదని సూచించారు. చంద్రబాబుకు మేలు చేసేందుకే రేవంత్ సర్కార్ నీటిని ఎత్తడం లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ నేతలకు ఉన్న సోయి తెలంగాణ నీళ్ల మంత్రికి లేకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. పాలమూరు లాంటి కరువు జిల్లాలో నీళ్లు ఉండీ కూడా విడుదల చేయకపోవడం నేరపూరిత చర్యగా భావించాల్సి వస్తుందని తెలిపారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, నీళ్ల మంత్రిని శిక్షించినా తప్పులేదని ఫైర్ అయ్యారు.