న్యూఢిల్లీ : యూపీఐ లావాదేవీలపై కేంద్రం విధించనున్న ఎండీఆర్‌పై దేశ వ్యాప్తంగా వ్యాపారుల నిరసన తీవ్రమవుతున్నది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 2న దేశ వ్యాప్తంగా ‘నో యూపీఐ డే’ను పాటించాలని వర్తక సంఘాలు నిర్ణయించాయి. ఈ నిరసనలో 500 సంఘాల వరకు పాల్గొంటాయని అంచనా వేస్తున్నారు. దుకాణదారులు కూడా ఈ నిరసనల్లో భాగం కానున్నారు. ఆ రోజు వ్యాపారులు తమ క్యూఆర్ కోడ్లను, స్కానర్లను, సౌండ్ బాక్స్‌లను, ఇతర డిజిటల్ చెల్లింపు పరికరాలను నల్లని వస్త్రంతో కప్పి కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసనను తెలపనున్నారు. ఈ నిరసన గురించి తాను దేశ వ్యాప్తంగా పలు వాణిజ్య సంఘాలతో మాట్లాడానని మహారాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ, అగ్రికల్చర్ అధ్యక్షుడు రవీంద్ర మంగ్వే తెలిపారు.
అఖిల భారత వినియోగ ఉత్పత్తుల పంపిణీదారుల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు ధైర్యశిల్ పాటిల్ మాట్లాడుతూ రిటైల్ వ్యాపారులు, డిస్ట్రిబ్యూటర్లు చాలా తక్కువ లాభంతో వ్యాపారాలు నిర్వహిస్తారని తెలిపారు. డిజిటల్ చెల్లింపులపై అదనపు చార్జీలు విధిస్తే వారి వ్యాపార నిర్వహణ భారమవుతుందన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించకపోతే తమ ఆందోళనను తీవ్రం చేస్తామని అఖిల భారత వంట నూనె వర్తకుల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు శంకర్ థక్కర్ హెచ్చరించారు. రిటైల్ వ్యాపారుల సంక్షేమ సంఘాల సమాఖ్య, ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్, అఖిల భారత నగల వర్తకులు, స్వర్ణకారుల సమాఖ్య, అఖిల భారత వంట నూనె వ్యాపారుల ఫెడరేషన్ అక్టోబర్ 2న ‘నో యూపీఐ డే’కు మద్దతు తెలుపుతున్నాయి.