నందిపేట్, డిసెంబర్ 8: స్థానిక సంస్థల ఎన్నికల్లో బాండ్ పేపర్ ట్రెండ్ నడుస్తున్నది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే బాండ్ పేపర్లు రాసిస్తున్నారు. పనులు చేయకపోతే రాజీనామా చేస్తానని మొన్న ఓ అభ్యర్థి గ్రామస్తులకు బాండ్ పేపర్ రాసివ్వగా, తాజాగా మరో అభ్యర్థి అలాగే చేశాడు. అయితే, తన పదవీకాలంలో అక్రమాలకు పాల్పడనని, అక్రమంగా సంపాదిస్తే ఆ డబ్బును జప్తు చేసి ప్రజలకు పంచి పెట్టాలని రాసిచ్చాడు.
నందిపేట్ మండలం ఉమ్మెడ గ్రామానికి చెందిన గుడ్డోల్ల సాయన్న (సాయరెడ్డి)సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్న ఆయన.. అవినీతికి పాల్పడడని హామీ ఇస్తున్నారు. పనులు చేయడానికి చేయి చాచనని, జీపీ సొమ్మును అక్రమంగా ఖర్చు చేయనని, తప్పుడు లెక్కలు చూపి వెనుకేసుకోనని చెబుతున్నారు. ‘సర్పంచ్గాఎన్నుకుంటే నేను కానీ, నా కుటుంబం కానీ ఇప్పుడున్న ఆస్తులకు మించి అక్రమంగా ఎంత సంపాదించినా, అలా పెరిగిన వాటిని గ్రామ పంచాయతీ జప్తు చేసి ప్రజలకు పంచవచ్చని’ సాయన్న ఓటర్లకు బాండ్ పేపర్‌పై రాసిచ్చారు.