వర్ని, జూన్ 12: పొతంగల్ మండలంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు చేరాల్సిన ఇసుకను పక్కదారి పట్టించి అందినకాడికి దోచుకుంటున్నారు. అధికారుల కండ్లు కప్పి ఇసుక దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. దీంతో ఇసుక అందక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. పొతంగల్ ఇసుక క్వారీల నుంచి వర్ని, రుద్రూర్ మండలాల్లోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, సొంతంగా ఇండ్లు కట్టుకునే వారు ‘మన ఇసుక వాహనం’ యాప్ ద్వారా ఇసుకను బుక్ చేసుకుంటున్నారు.
దీంతో అధికారులు లబ్ధిదారులు బుక్ చేసుకున్న ఇసుకను పంపించేందుకు వేబిల్లులను ట్రాక్టర్ డ్రైవర్లకు ఇచ్చి పంపిస్తున్నారు. పంపించిన ఇసుక ట్రాక్టర్లలో సగానికి పైగా మధ్యలోనే మాయమవుతుండడం గమనార్హం. లబ్ధిదారులు చెప్పిన ఓటీపీ ద్వారా ఒకటి రెండు ఇసుక ట్రాక్టర్లు మాత్రమే వారికి చేరుతున్నారు. దీంతో మిగతా ఇసుక ట్రాక్టర్లు ఎప్పుడొస్తయోనని లబ్ధిదారులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. తమకు రావాల్సిన ఇసుక దోపిడీకి గురవుతున్నది, అక్రమార్కులు మాయం చేశారని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియలేని పరిస్థితిలో ఉంటున్నారు.
లబ్ధిదారులు బుక్ చేసుకున్న ఇసుకను కొందరు ట్రాక్టర్ డ్రైవర్లు బయట అక్రమంగా అమ్ముకొని సొమ్ముచేసుకుంటున్నారు. సొమ్మొకడిది సోకొకడిది అన్నట్లు వందల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లను లబ్ధిదారులకు చేరకుండా మా యం చేస్తున్నారు. తాము బుక్ చేసుకున్న ఇసుక తమకు చేరేలా చూడాలని లబ్ధిదారులు అధికారులను కోరుతున్నారు.