నిజామాబాద్, మే 6, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతుభరోసా పథకం అమలవుతోన్న తీరు హాస్యాస్పదంగా మారుతోంది. పంటల సీజన్ ప్రారంభంలో రైతులకు అందాల్సిన పెట్టుబడి సాయం సీజన్ ముగుస్తోన్న పత్తా లేకుండా పోతోంది. ఒక సీజన్లో నగదు సాయం అందితే… మరో సీజన్‌కు సందిగ్ధత ఏర్పడుతోంది. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో పెట్టుబడి సాయం పథకం సరైన రీతిలో అమలుకు నోచుకోవడం లేదు. రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలకు దిక్కూ దివానా లేకుండా పోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
యాసంగి 2026 మరికొద్ది రోజుల్లోనే ముగుస్తోంది. అయినప్పటికీ పథకం అమలు పూర్తి స్థాయిలో జరగలేదు. ఇదేంటని అడిగితే సమాధానం ఇచ్చేవారే లేకుండా పోయారు. కాంగ్రెస్ పాలకులు మాత్రం ప్రజాపాలన పేరుతో నిర్వహిస్తోన్న కార్యక్రమాల్లో భారీ ప్రకటనలు చేస్తున్నారు. చేతలకు, మాటలకు పొంతనే కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ సీజన్లో పెట్టుబడి సాయం రెండు విడతల్లో నగదు జమ జరిగింది. మొదటి విడతలో ఒక ఎకరానికి, రెండో విడతలో మరో ఎకరానికి మొత్తం రెండు ఎకరాలకే పెట్టుబడి సాయం అందింది. మిగిలిన ఎకరాలకు రైతుభరోసా ఎప్పుడు అందుతుందో? అర్థం కావడం లేదు.
యాసంగి ముగిసి వానాకాలం వస్తోంది. ధాన్యం విక్రయించిన రైతులంతా విత్తన, ఎరువులను సర్దుకునేందుకు సిద్ధం అవుతున్నారు. వానాకాలంలో సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతుంది. నీటి వసతి లేని వారంతా వానాకాలంలోనే భారీ ఆశ పెట్టుకుంటున్నారు. అలాంటి వారంతా పెట్టుబడి సాయం అందితే బాగుంటుందని భావిస్తున్నారు. కానిప్పుడు యాసంగికే రైతుభరోసా సరిగా అమలు కాకపోవడం మూలంగా వానాకాలానికి ముప్పు ఏర్పడినట్లేనని భావించాల్సి వస్తోంది.
బీఆర్ఎస్ హయాంలో ప్రతి రైతుకు రైతుబంధు పథకాన్ని సమయానికి అందించారు. పంట కాలం మొదలు అవుతుందనేలోపే రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యేది. ఆ సమయంలో పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లుగా మాట్లాడాడు. ఏడాదికి మూడు పంటలకు రైతుబంధు అమలు చేయాలని రెచ్చగొట్టాడు. పెద్ద రైతులకు పెట్టుబడి సాయం ఎందు కు? అని ప్రశ్నించాడు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత తాను చెప్పిన డైలాగులను పూర్తిగా రేవంత్ రెడ్డి మర్చిపోయినట్లే కనిపిస్తోంది.
ఏడాదికి మూడు పంటలకు పెట్టుబడి సాయం చేయాలని చెప్పిన వ్యక్తి… ఇప్పుడు ఒక సీజన్‌కైనా సరిగా నగదు సాయం అందివ్వకపోవడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రైతుభరోసా పథకం అమలులో జాప్యం మూలంగా సన్న, చిన్నకారు రైతులకే అత్యధికంగా నష్టం వాటిల్లుతోంది. గ్రామా ల్లో అత్యధికంగా వ్యవసాయ భూములు కలిగి ఉన్న వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న నిర్లక్ష్యం వల్ల బడుగు, బలహీన వర్గాలకు తీరని అన్యాయం వాటిల్లుతోంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టుబడి సాయం డబ్బుతో నష్టాలు పూడ్చుకుని గట్టెక్కే పరిస్థితి రైతులకు ఉండేది.
పెట్టుబడికి డబ్బులు లేకపోవడంతో రైతులు అప్పు ల పాలవుతున్నారు. సాగు ఖర్చులకు గతం లో కేసీఆర్ పాలనలో సమయానికి నగదు చేతికి అందేది. అప్పులపై ఆధారపడుకుండానే పంటలు పండించారు. కానిప్పుడు అదను దాటినప్పటికీ పెట్టుబడి సాయం వస్తుందో? రాదో? తెలియని అయోమయం ఏర్పడింది. ఫలితంగా అప్పులు తీసుకోవడం రైతులకు అనివార్యమైంది. ప్రస్తుతం రైతు భరోసా పథకం అమలుపై నీలినీడలు అలుముకున్నాయి. యాసంగి సీజన్‌కు మూడో విడతను ఏప్రి ల్ నెలాఖరులోగా అమలు చేస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
మే నెల ప్రారంభమైనప్పటికీ ఊసే లేకుండా పోయింది. రైతుభరోసా పథకాన్ని రెండు ఎకరాలతోనే ఈ సీజన్‌ను ముగిస్తారనే చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతోన్న పెట్టుబడి సాయం నాటకాలపై రైతులు మండిపడుతున్నారు. పూటకో మాట మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి రైతులను ఆదుకునే సత్తా లేదని మండిపడుతున్నారు. కేసీఆర్ హయాంలో రైతుబంధు పథకం ఠంచనుగా అమలైందని… కాంగ్రెస్ పాలనలో రైతుభరోసాకు దిక్కూ మొక్కూ లేకుండా పోయిందంటున్నారు. రెండు ఎకరాలకే అందిన సాయం వల్ల ఎటూ సరిపోవడం లేదని కర్షకులు చెబుతున్నారు. గ్రామాల్లో చిన్న, సన్నకారు రైతులకు దాదాపుగా 2 ఎకరాలకు పైగానే భూమి విస్తీర్ణం ఉంది. రెండు విడతల్లో అందిన రైతుభరోసాతో రైతులు సంతృప్తి చెందడం లేదు.