రూ.10 లక్షల పెట్టుబడి విలువ కలిగిన ఊర్మిక కంపెనీకి బెకన్ కంపెనీ రూ.140 కోట్లు రుణంఎలా ఇచ్చిందో సమాధానం చెప్పాలి. ఆ సీక్రెట్ ఏందో ప్రేమ్‌సాగర్‌రావు వెల్లడించాలి. రేవంత్‌తో చీకటి బంధమేదీ లేకపోతే ఈడీ విచారణకు ప్రధాని మోదీ,కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆదేశించాలి.
– ఆర్ఎస్ ప్రవీణ్
మంచిర్యాల, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాదిన్నర లోనే.. అంటే 480 రోజుల్లోనే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు బ్యాంకుల నుంచి తాను తీసుకున్న రూ.444 కోట్ల అప్పు చెల్లించారు. ఇందులో మర్మమేమిటి? ఆ కిటుకు ఏమిటి?’ అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. పీఎస్ఆర్ రుణ చెల్లింపుల అంశంపై పలు వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆర్ఎస్పీ అందజేసిన ఆధారాల ప్రకారం.. పీఎస్ఆర్కు చెందిన సాయినాథ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, భాగ్యనగర్ హోటల్స్ సంస్థలపై 2010 నుంచి 2013 మధ్యలో నాలుగు బ్యాంకుల నుంచి 444 కోట్ల అప్పు తీసుకొని, ఎమ్మెల్యేగా గెలిచిన 2023, డిసెంబర్ 7 నుంచి 2025 మార్చి ఆఖరుకు.. సరిగ్గా 16 నెలల్లో తిరిగి చెల్లించారు. ఈ మేరకు ఆయా బ్యాంకుల నుంచి అప్పు చెల్లించినట్టు ఎన్వోసీ (నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్స్)లు సైతం తీసుకున్నారు. ఈ వివరాలన్నీ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వెబ్సైట్లో ఉన్నాయి. ఇదే విషయంపై ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు మొన్నటికి మొన్న గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించి రూ.450 కోట్ల లోన్ మంజూరైందని, అందులో రూ.109.11 కోట్లే వాడుకున్నామని.. ఆ లోన్ చెల్లించకపోవడంతో ఎన్‌పీఏలోకి కంపెనీలు వెళ్లాయని చెప్పారు.
అనంతరం 2015-21 మధ్యకాలంలో రూ.44.81 కోట్లు తిరిగి చెల్లించామని తెలిపారు. 2020లో ఎన్సీఎల్టీలో సెటిల్మెంట్ ప్రతిపాదించి బ్యాంకులకు వడ్డీతో కలిపి రూ.150.02 కోట్లు చెల్లించామని చెప్పారు. మొత్తంలో రూ.109.11 కోట్ల అప్పు వాడుకొని రూ.195 కోట్లు చెల్లించినట్టు వివరించారు. కాగా, ఎమ్మెల్యే చెప్పిన వివరాలకు, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వెబ్సైట్లో బ్యాంకుల నుంచి తీసుకున్న ఎన్వోసీలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. వాడుకున్న మొత్తం రూ.109.11 కోట్లు, చెల్లించింది రూ.195 కోట్లు అనుకుంటే.. మరి రూ.444 కోట్లు చెల్లించినట్టు బ్యాంకులు ఎన్వోసీలు ఎందుకు ఇచ్చాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుతో పాటు ఆయన కుటుంబసభ్యులు వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థల్లో వాటాదారులుగా ఉన్నారు. కొన్ని వ్యాపార సంస్థలు తీసుకున్న రుణాలకు సెక్యూరిటీ ఇచ్చారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, సన్నిహితులు భాగస్వామిగా ఉన్న సాయినాథ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.357 కోట్లు, భాగ్యనగర్ హోటల్స్ రూ.87 కోట్లతో పాటు మరో 9 సంస్థలు బ్యాంకుల నుంచి 2013కు ముందు మొత్తం కలిపి దాదాపు రూ.470 కోట్ల మేర రుణాలు తీసుకున్నాయి. కొన్నేండ్లుగా వడ్డీ, అసలు చెల్లించకపోవడంతో సదరు సంస్థలను బ్యాంకులు మొండి బకాయిదారులుగా ప్రకటిస్తూ డిమాండ్ పొజిషన్ నోటీసులు సైతం ఇచ్చాయి. కార్పొరేట్ డెబ్టార్ (రుణగ్రహీత)గా పేర్కొంటూ నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో కేసులు నడిచాయి. ఎమ్మెల్యేగా గెలిచిన 16 నెలల్లోనే అప్పులు తీర్చేయడం సంచలనంగా మారింది.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బ్యాంకులకు చెల్లించిన అప్పులకు సంబంధించి ముంబైలోని బెకన్ ట్రస్టీషిప్ లిమిటెడ్ కంపెనీతో పాటు మరో సంస్థ నుంచి రూ.140 కోట్లు అప్పు తెచ్చినట్టుగా చెప్తున్నారు. ఆ బెకన్ అనే కంపెనీ ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ఊర్మిక వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఈ మొత్తాన్ని అప్పుగా ఇచ్చింది. వడ్డీ మొదటి రెండు సంవత్సరాలు 20 శాతం, 24 నెలల్లోపు తీసుకున్న డబ్బులు కట్టకపోతే 30 శాతం చొప్పున చెల్లించాలి. కాకపోతే డీఫాల్టర్‌గా ఉన్న పీఎస్ఆర్ కుటుంబానికి చెందిన ఊర్మిక కంపెనీకి అంతపెద్ద మొత్తంలో బెకన్ అండ్ అదర్స్ ఎలా రూ.140 కోట్లు ఇచ్చారన్నది ప్రశ్నార్థకంగా మారింది. బ్లాక్ మనీ బెకన్ నుంచి వైట్ మనీగా వచ్చిందనే ఆరోపణలకు బలం చేకూరుస్తున్నది. ఎమ్మెల్యే పీఎస్ఆర్ చెప్పినట్టు రూ.109.11 కోట్లే వాడుకుంటే జనవరి 21, 2023న కెనెరా బ్యాంక్ రూ.140.57 కోట్లకు భాగ్యనగర్ హోటల్‌కు ఈ-ఆక్షన్ సేల్ నోటీస్ ఇచ్చిన విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రేమ్‌సాగర్‌రావు ఎమ్మెల్యేగా గెలిచిన 500 రోజుల్లో రూ.500 కోట్ల అప్పులు కట్టారని, అంటే రోజుకు రూ.కోటి చొప్పున దోచుకున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు విజిత్‌రావు మండిపడ్డారు. బ్యాంకుల నుంచి సాయినాథ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, భాగ్యనగర్ హోటల్స్ సంస్థల పేరిట ఎమ్మెల్యే పీఎస్ఆర్ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు, చెల్లింపులు, ఎన్వోసీలు ఇతర ఆధారాలను మీడియాకు విడుదల చేశారు. బ్యాంకుల నుంచి ఎమ్మెల్యే తీసుకున్న అప్పులపై మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎస్ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ‘తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ‘ఇంజినీరింగ్ చదవడం క్రిమినల్ వేస్ట్ ఆఫ్ టైమ్’ అని ఎందుకు అన్నారో నాకు ఇప్పుడు అర్థమైంది.
ఎందుకంటే మంచిర్యాల ఎమ్మెల్యే ఎలాంటి ఇంజినీరింగ్ చదువకుండానే, ఏ నాలుగు సంవత్సరాల కోర్స్ పూర్తి చేయకుండానే అద్భుతంగా రోజుకు రూ.కోటి సంపాదిస్తున్నారు. ఇక ఇంజినీరింగ్ నాలుగేండ్లు చదివే బదులు.. మంచిర్యాలకు వచ్చి కూర్చుంటే పీఎస్ఆర్ చదువు చెప్పి రోజుకు రూ.కోటి ఎలా సంపాదించాలో నేర్పిస్తారు.. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చెప్పకనే చెప్పారు’ అని ఎద్దేవాచేశారు. ఎమ్మెల్యేపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చూస్తుంటే తనకు కేజీఎఫ్ (కొక్కిరాల గ్యాంగ్‌స్టర్ ఫైల్స్) సినిమా గుర్తుకువస్తున్నదని తెలిపారు. ఎమ్మెల్యే పీఎస్ఆర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.120 కోట్లు కట్టారనగానే తనకు హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యాలు గుర్తుకు వచ్చారని, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను ముంచి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లకు ఎలాంటి లక్షణాలున్నాయో అలాంటి లక్షణాలే ఎమ్మెల్యే పీఎస్ఆర్లోనూ కనిపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘అప్పుల చెల్లింపులో ఎమ్మెల్యే పీఎస్ఆర్ ఏ తప్పూ చేయకుంటే మీకు ఏ కంపెనీలున్నాయో? ఆ కంపెనీల వివరాలు, వాటి బ్యాంక్ అకౌంట్స్ వివరాలు మొత్తం పబ్లిక్ డొమైన్లో పెట్టాలి’ అని విజిత్‌రావు డిమాండ్ చేశారు. తనకు విదేశాల్లో ఎలాంటి ఆస్తులు లేవన్న పీఎస్ఆర్ మళ్లీ ప్రెస్‌మీట్ పెట్టినప్పుడు బైనాలో బ్యాంక్ అకౌంట్ లేదని, మలేషియాలో మైనింగ్ బిజినెస్ చేయలేదని, ఐదుగురు పార్ట్‌నర్స్‌తో కలిసి ఎలాంటి భూములు కొనలేదని, బ్రెజిల్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బ్రెజిల్లో బ్యాంక్ అకౌంట్ లేదని, హాంగ్‌కాంగ్‌లో బ్లూ కలర్ కారు లేదని చెప్పాలని సవాల్ చేశారు.
ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు అప్పుల చెల్లింపు విషయంపై లోతైన దర్యాప్తు చేయాలని, ఎమ్మెల్యేను జైలుకు పంపాలని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు. ‘ఎమ్మెల్యే ఒక ప్రజాప్రతినిధి.. ఎట్లా జైలుకు పంపిస్తారు? అనే డౌట్ రావచ్చు. కానీ ఎమ్మెల్యే రూ.2.50 లక్షల జీతం తీసుకుంటున్నారు. అలా జీతం తీసుకుంటున్న అధికారులకు ఎలాగైతే అనినీతి నిరోధక చట్టం వర్తిస్తుందో జీతం తీసుకుంటున్న ఎమ్మెల్యేకు కూడా అదే వర్తిస్తుంది’ అని చెప్పారు. ఎమ్మెల్యే అప్పుల చెల్లింపు వ్యవహారంపై ఈడీతో లోతైన దర్యాప్తు చేయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డితో చీకటి బంధం లేకపోతే ఈడీ విచారణకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆదేశించాలని కోరారు. ఈ వ్యవహారంపై న్యాయస్థానాలను సైతం ఆశ్రయిస్తామని స్పష్టంచేశారు.
నిన్నగాక మొన్న గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టిన ప్రేమ్‌సాగర్‌రావు.. ‘అయ్యా నాకు రూ.470 కోట్ల లోన్ వస్తే, నేను రూ.190 కోట్లు మాత్రమే తీసుకున్నా’ అని చెప్పారని, ఆయన చెప్పిన అబద్ధాలు నమ్మడానికి తమ చెవిలో పూలు లేవని ఆర్ఎస్పీ దెప్పిపొడిచారు. అసలది గాంధీభవన్ కాదని గ్రహచార భవన్ అని ధ్వజమెత్తారు. ఎందుకంటే అక్కడున్న పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్ మనషులు మాట్లాడే భాష మాట్లాడటం లేదని తెలిపారు. వాళ్లు యాంత్రిక, మాంత్రిక, తాంత్రిక భాషలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
దేవుళ్ల దగ్గరికి పోయి పూజలు చేసినా అవి క్షుద్రపూజలని చెప్పి హిందూ సమాజాన్ని అవమానించే పరిస్థితి ఇవాళ గాంధీ భవన్లో ఉన్నదని మండిపడ్డారు. ‘ఎమ్మెల్యే పీఎస్ఆర్ అందర్నీ బెదిరించినట్టే మీ పోలీసులను చూపించి మా బీఆర్ఎస్ నాయకులను బెదిరించలేరు. నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోనే పనిచేసిన.. పోలీసులను ఇంటికి పంపించి, రాత్రికిరాత్రే కేసులు పెట్టించి.. ఎదురు తిరిగిన వారిని గూండాలతో కొట్టించి తిరిగి దెబ్బలు తిన్న వారిపైనే కేసులు పెడుతున్నరు., ఒక్క మంచిర్యాలలోనే కాదు, తెలంగాణ అంతటా ఇలాంటి ఆటవిక రాజ్యమే నడుస్తున్నది. ఇందుకు మంచిర్యాల నియోజకవర్గం మంచి ఉదాహరణగా నిలుస్తుంది’ అని దుయ్యబట్టారు. ‘మీరు ఎన్ని కేసులు పెట్టినా.. ఏం చేసినా మా విజిత్‌రావు లాంటి బీఆర్ఎస్ నాయకులను భయపెట్టలేరు’ అని తేల్చిచెప్పారు.
కేవలం రూ.10 లక్షల పెట్టుబడి విలువ కలిగిన ఊర్మిక కంపెనీకి ముంబైకి చెందిన బెకన్ కంపెనీ రూ.140 కోట్లు రుణం ఎలా ఇచ్చిందో సమాధానం చెప్పాలని, ఆ సీక్రెట్ ఏందో ప్రేమ్‌సాగర్‌రావు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బిల్డింగ్‌లను ఎలా కూల్చా లో, చెరువులను ఎలా కబ్జా చేయాలో, ముల్క ల్ల, పోచంపాడులో పేదల భూములను ఐటీ పార్క్ అని జీవో తెచ్చి ఎట్లా గుంజుకోవాల్నో, ఇసుక, మట్టి దందాలు ఎట్లా చేయాల్నో ఆ సీక్రెట్స్ అన్నీ చెప్పాలని దెప్పిపొడిచారు. హైడ్రాకు, విజిలెన్స్-ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు, గనుల శాఖ మంత్రి వివేక్‌కు మంచిర్యాల చెరువుల కబ్జాలు, ఇసుక, మట్టి దందాలు ఎందుకు కనిపించడం లేదని నిలదీశారు.
