నిజామాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఆరు నెలలు దాటింది. అయినా జిల్లాకు పెద్ద దిక్కుగా ఉండాల్సిన మంత్రి పదవి ఎవ్వరికీ ఇవ్వలేదు. రేవంత్రెడ్డిప్రభుత్వంలో ఈ ప్రాంతం తీవ్రమైన నిర్లక్ష్యానికి గురవుతుండడంపై సొంత పార్టీలోనే రుసరుసలు వినిపిస్తున్నాయి. అర్హత కలిగిన నాయకులు ఉన్నప్పటికీ ఈ ప్రాంతం నుంచి కేబినెట్లోకి ఎవ్వరినీ తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది. ఆశలు పెట్టుకున్న నేతలంతా మంత్రివర్గంలో చోటు కోసం ఢిల్లీస్థాయిలో పైరవీలు చేసినట్లు తెలిసింది. నేతలంతా రాజధానుల్లోనే మకాం వేయడంతో ఉమ్మడి జిల్లా పరిపాలన కుంటుపడుతున్నది. ప్రభుత్వ పథకాల అమలుతోపాటు పరిపాలనను సవ్యదిశలో పెట్టాల్సిన నేతలు చేతులెత్తేయడంతో ప్రభుత్వ శాఖల్లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు పరిస్థితి మారిపోయింది.
పదవులపైనే యావ.. ప్రజలు పట్టరా..?
ఏటా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందే గత కేసీఆర్ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఉమ్మడి సమీక్ష నిర్వహించి యంత్రాంగానికి సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ఉమ్మడి జిల్లాలో మొన్న జరిగిన యాసంగి ధాన్యం సేకరణలో అలాంటి సమీక్షా సమావేశమే జరుగలేదు. ఇన్చార్జి మంత్రి తొలుత కేవలం మైనింగ్ శాఖ, ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణపైనే సమీక్షించి వెళ్లిపోయారు. తదనంతరం కీలకమైన ధాన్యం కొనుగోళ్లపై ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇన్చార్జి మంత్రి సహా ఎవ్వరూ దృష్టి పెట్టలేదు. దీంతో తీవ్ర ఆటంకాల మధ్య కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగింది. రేవంత్ మంత్రివర్గంలో చోటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నేతలకు కూడా ప్రజాప్రయోజనాలు పట్టకపోవడం చర్చనీయాంశమైంది.
రెడ్డి వర్సెస్ బీసీ వర్సెస్ మైనార్టీ..
మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్‌రెడ్డి పేరు దాదాపుగా ఖరారైందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తున్న తరుణంలో తెరపైకి కొత్తగా మరికొంత మంది పేర్లు కూడా వినిపిస్తుండడం ఆసక్తి గొలుపుతున్నది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్, పీసీసీ ముఖ్య నాయకుడు షబ్బీర్ అలీ పేర్లు సైతం పరిశీలనలో ఉన్నట్లు జోరుగా చర్చ జరుగుతున్నది. అవసరమైతే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి ఇద్దరికి మంత్రి పదవి దక్కే వీలున్నట్లు కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. అదే జరిగితే ఎవరెవరికి మంత్రి పదవి దక్కుతుందోనన్న ఆసక్తి హస్తం నేతల్లో కనిపిస్తున్నది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారిలో షబ్బీర్ అలీ మినహాయిస్తే మిగతా అంతా అగ్రవర్ణాలకు చెందిన వారే ఉన్నారు. బీసీలకు తీవ్రంగా అన్యాయం జరిగింది.
చట్టసభల్లో బీసీలకు ఉమ్మడి జిల్లా నుంచి ప్రాధాన్యమే దక్కలేదు. మహేశ్‌కుమార్ గౌడ్‌కు ఎమ్మెల్సీ ఇచ్చినప్పటికీ, ప్రత్యక్ష ఎన్నికల్లో చాలా మంది టికెట్ ఆశించగా భంగపాటుకు గురయ్యారు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో బీసీలకు పెద్దపీట వేస్తారా..? లేదంటే అగ్రవర్ణాలకు చోటు కల్పిస్తారా? అన్నది ఆసక్తి రేకెత్తిస్తున్నది. రేవంత్ కేబినెట్లో మైనార్టీ లీడర్లకు చోటు లేకుండా పోయింది. షబ్బీర్ అలీ పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో ఆ వర్గానికి స్థానమే కరువైంది. ఈ నేపథ్యంలో మైనార్టీ కోటాలో షబ్బీర్‌కు అమాత్యయోగం వరిస్తుందా.. లేదా? అన్నది వేచి చూడాల్సి ఉంది. మొత్తానికి ఉమ్మడి జిల్లాలో తాజా రాజకీయాన్ని పరిశీలిస్తే రెడ్డి వర్సెస్ బీసీ వర్సెస్ మైనార్టీ అన్న భావన కనిపిస్తున్నది. సుదర్శన్‌రెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్, షబ్బీర్ అలీల్లో ఎవరికి అమాత్యయోగం దక్కుతుందో కాలమే తేల్చనున్నది.
చుట్టపు చూపుగా ఇన్చార్జి మంత్రి..
ఉమ్మడి రాష్ట్రంలో, స్వరాష్ట్రంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఈ ప్రాంతానికి ఎల్లవేళలా ఆదరణ దక్కింది. కానీ మొదటిసారి రేవంత్ సర్కారులోనే మంత్రి పదవి లేక నిర్లక్ష్యానికి గురైంది. ఆర్నెళ్ల కాలంలో ఉమ్మడి జిల్లాకు మంత్రి లేకపోవడంతో పరిపాలన గాడి తప్పినైట్లెందని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. కార్పొరేషన్ పదవులు కట్టబెట్టినట్లుగా పేపర్ ప్రకటనలు చేశారు. అందులో నలుగురు నాయకులకు చోటు కల్పించారు. మూడు నెలలవుతున్నా జీవో మాత్రం రాలేదు. ఇక ప్రభుత్వ విప్ పదవుల్లోనూ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలకు చోటు లేకుండా పోయింది.
కేవలం ప్రభుత్వ సలహాదారుగా షబ్బీర్ అలీకి బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం తొమ్మిది అసెంబ్లీ స్థానాలుంటే కామారెడ్డి జిల్లాలో రెండు చోట్ల, నిజామాబాద్ జిల్లాలో రెండు చోట్ల హస్తం పార్టీ గెలిచింది. ఇందులో సీనియర్ ఎమ్మెల్యేగా సుదర్శన్‌రెడ్డి ఒక్కరే ఉన్నారు. పీసీసీ ముఖ్య నాయకుడిగా షబ్బీర్ అలీ ఉన్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమి చవిచూశారు. మంత్రివర్గ విస్తరణలో మొదట్నుంచి ఉమ్మడి జిల్లా నుంచి సీనియర్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్, షబ్బీర్ అలీలకు చోటు దక్కుతుందని చర్చ నడుస్తున్నది. ఉభయ జిల్లాల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో ముగ్గురూ కొత్త వారే ఉన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.భూపతిరెడ్డి మొదటిసారి గెలిచిన వారే.