ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు ప్రత్యేక బస్సు సర్వీసుల పేరుతో టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికులపై తీవ్ర భారం మోపుతున్నది. అదనపు చార్జీల పేరిట సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి మేలు చేస్తున్నట్లుగా వ్యవహరించిన సంస్థ..పండుగల పేరిట అదనపు చార్జీలను వసూలు చేస్తూ ప్రయాణికుల నడ్డి విరుస్తున్నది. మొన్న రాఖీ పండుగ కోసం ప్రత్యేక బస్సుల ద్వారా సామాన్యులను బాదిన ఆర్టీసీ.. ఇప్పుడు బతుకమ్మ, దసరా పండుగలకు అదనంగా 50 శాతం చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నది. ఏకంగా 50శాతం అదనపు చార్జీలు వసూలుచేయడంపై ఉమ్మడి జిల్లాలోని ప్రయాణికులు మండిపడుతున్నారు.
-ఖలీల్‌వాడి/కామారెడ్డి, సెప్టెంబర్ 19
తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా. ఇతర రాష్ర్టాలు, నగరాలు, పట్టణాల్లో ఉన్నవారు ఈ పండుగకు స్వగ్రామాలకు వస్తారు. దీనిని ఆసరాగా చేసుకొని ఆర్టీసీ ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతున్నది. దసరా, బతుకమ్మ పండుగలు పూర్తయ్యే వరకు లక్షల మంది రాకపోకలు సాగిస్తారు. తిరుగు ప్రయాణం వరకు ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతుంటాయి. ఈ నెల 21 నుంచి విద్యా సంస్థలకు దసరా సెలవులు ప్రకటించడంతో స్వగ్రామాలకు వెళ్లే వారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు పట్టణాల నుంచి సొంతూళ్ల బాటపట్టనుండగా ఆర్టీసీ ఇదే అదనుగా ప్రత్యేక బస్సు సర్వీసుల పేరిట అధిక చార్జీలను వసూలు చేస్తున్నది.
ఆర్టీసీ బస్సుల్లో ఎక్కువగా సామాన్యజనంతోపాటు ఉద్యోగులు, చిరు వ్యాపారులు ప్రయాణిస్తుంటారు. పేదల ప్రభుత్వంగా గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం వారిపై ఆర్థిక భారం మోపుతున్నది. 50శాతం అదనంగా వసూలు చేస్తూ సామాన్యుడ నడ్డి విరుస్తున్నది. పండుగ పేరిట చార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడంతో..పురుషుల పరిస్థితి దారుణంగా మారింది. బస్సు టికెట్ తీసుకున్నా సీటు దొరుకుతుందన్న గ్యారెంటీ లేదు. చాలా మంది నిలబడే ప్రయాణం చేయాల్సి వస్తున్నది.
ఫ్రీ బస్సు పథకం అమలుకన్నా ముందు టీజీఎస్ ఆర్టీసీ నిజామాబాద్ నుంచి కరీంనగర్, వరంగల్‌కు డీలక్స్ బస్సులు నడిపేదికాదు. ఫ్రీ బస్సు పథకం అమలు తర్వాత ఎక్కడ చూసినా డీలక్స్ బస్సులే దర్శనమిస్తున్నాయి. మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌లోనే ఉచిత ప్రయాణం ఉండడంతో గత్యంతరం లేక డీలక్స్ బస్సులను ఆశ్రయించాల్సి వస్తున్నది. దసరాకు నడుపుతున్న ప్రత్యేక సర్వీసుల టికెట్ ధర 50శాతం పెంచడంతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తూనే పండుగలు వస్తే మాత్రం సామాన్యులపై అదనపు భారం మోపడం ఎంత వరకు సబబని సామాన్యులు సోషల్‌మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.
మెరుగైన సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆర్టీసీ..ఇలా పండుగల పూట అదనపు చార్జీల పేరిట బాదడంపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి అదనపు భారం వేయకుండా సామాన్యులకు అందుబాటులో ఉండేలా చార్జీలు వసూలు చేయాలని కోరుతున్నారు. అదనపు చార్జీలపై నిజామాబాద్ ఆర్టీసీ ఆర్ఎంకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు.