బోధన్, అక్టోబర్ 11: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాల్సిన ఆర్టీసీ పండుగ వేళల్లో వారికి చుక్కలు చూపిస్తున్నది. సాధారణంగా పండుగ వేళల్లో బస్సుల్లో రద్దీ సర్వసాధారణం. ఎక్కడెక్కడి నుంచో ఉద్యోగులు, విద్యార్థులు తమ సొంతూళ్లకు వస్తుంటారు. ఇందులో ఎక్కువ మంది ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తుండగా.. వారికి సర్వీసుల రాక కోసం నిరీక్షణ తప్పడంలేదు. దసరా పండుగ కోసం స్వగ్రామాలకు వచ్చేవారు ఆర్టీసీలో ప్రయాణమంటేనే భయపడుతున్నారు.
సమయానికి బస్సులు రాకపోవడం.. ఒకవేళ వచ్చినా అందులో సీటు దొరకడం గగనం. ఎంతదూరమైనా నిలబడి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. పండుగలను దృష్టిలో ఉంచుకొని బస్సు సర్వీసులను పెంచి ప్రయాణికుల ఇబ్బందులను తీర్చాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దసరా పండుగ సందర్భంగా స్వగ్రామాలకు, బంధువుల ఇండ్లకు వెళ్లాలనుకునే ప్రయాణికులు బస్సుల రాకకోసం గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి దాపురించింది.
పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంత ప్రజలకు కేవలం స్కూళ్లు కొనసాగే సమయంలో మాత్రమే బస్సు సర్వీసులు ఉండగా, సెలవుల సందర్భంగా సదరు సర్వీసులు రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. అధికారులు మా త్రం దసరా సందర్భంగా అదనంగా సర్వీసులు కొనసాగించామని చెబుతున్నారు. కానీ విద్యాసంస్థలకు సెలవు కావడంతో బస్సులు రద్దు చేసిన మాట వాస్తవమని అధికారులే వెల్లడించడం గమనార్హం.