Robbery | వినాయక నగర్, డిసెంబర్ 25 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్వయంభూ శంభుని గుడిలో పట్టపగలు దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. ఆలయం గోడదుకి లోనికి ప్రవేశించి గుడిలోని పూజ సామగ్రిని దోచుకు వెళ్లిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. బుధవారం మధ్యాహ్నం సమయంలో ఓ దుండగుడు నగరంలోని హైమది బజార్ ప్రాంతంలో గల శంభుని గుడి గోడ దూకి లోనికి వచ్చాడు.
అనంతరం అక్కడ ఉన్న వెండి హారతి పల్లాలు, శత గోపురం, ఇత్తడి పూజ సామాగ్రి, పంచలోహ హారతి పళ్లెం, రాగి ప్లేట్లు దోచుకుని పరారయ్యాడు. సాయంత్రం సమయంలో పూజారి వచ్చి ఆలయం ప్రధాన గేటు తెరిచి లోనికి వెళ్లగా అక్కడ ఉన్న పూజ సామగ్రి కనిపించలేదు. దీంతో పూజారి ఆలయ చైర్మన్ అయినా బింగి మధుకు సమాచారం అందించాడు. ఈ చోరీ విషయమై సంబంధిత రెండోటౌన్ పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వడంతో ఎస్సై ముజాహిద్ ఘటన స్థలాన్ని పరిశీలించారు.
అనంతరం ఆలయ పరిసర ప్రాంతాల్లో గల సీసీ కెమెరాలు పరిశీలించగా దుండగుడు ఆలయం గోడ దూకి లోపటికి వెళ్లి చోరీ చేసిన అనంతరం తిరిగి వెళ్లే దృశ్యాలన్నీ సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దొంగిలించిన ఆలయ పూజ సామాగ్రిని కొనుగోలు చేసిన వ్యాపారి ఆచూకీ తెలుసుకున్నారు. దీంతో స్థానిక ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నీ మిర్చి కాంపౌండ్ ప్రాంతంలో పాత సామాన్లు కొనుగోలు చేసే ఓ వ్యాపారి దొంగ కు కేవలం రూ.200 ముట్టజెప్పి పూజ సామగ్రిని తీసుకున్నట్లు పోలీసులకు విచారణలో తేలింది. ఈ చోరీ ఘటనపై ఆలయ పూజారి రాజ్ కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండో టౌన్ ఎస్ఐ సయ్యద్ ముజాహిద్ కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ ల ఆధారంగా ఆలయంలో చోరీకి పాల్పడిన దుండగుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.