నిజామాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : లోక్‌సభ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ సన్నాహాక సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నేతృత్వంలో సమీక్ష జరిగింది. ఈ మీటింగ్‌కు కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్, నారాయణ్‌ఖేడ్, ఆంధోల్, జహీరాబాద్ నియోజకవర్గాలకు చెందిన నేతలంతా హాజరయ్యారు. ఇందులో కూలంకషంగా చర్చ జరిగిందని నేతలు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎదురైన అనుభవాలను ముఖ్య నేతలంతా కేటీఆర్ ముందు ప్రస్తావించినట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల మెజార్టీతోనే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బీఆర్ఎస్ అవకాశం కోల్పోయిందని నేతలు అభిప్రాయపడ్డారు. గెలుపోటములు ఏ రకంగా ఉన్నప్పటికీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం గులాబీ పార్టీకే విజయావకాశాలున్నట్లు కేటీఆర్ తన ప్రసంగంలో చెప్పినట్లుగా నేతలు తెలిపారు. కొద్ది రోజుల్లోనే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నందున ప్రజల్లోకి వెళ్లి క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకం కావాలని తెలిపారు. జుక్కల్ నియోజకవర్గంలో హన్మంత్ షిండే ఓడిపోవడం తనను తీవ్రంగా కలిచి వేసిందని కేటీఆర్ ప్రస్తావించారు. నాయకులంతా కలిసి మెలిసి పని చేసి లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
ప్రజల్లో కేసీఆర్‌పై అభిమానం ఏ మాత్రం చెక్కు చెదరలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన వాళ్లు కూడా కేసీఆర్ సీఎం కానందున బాధపడుతున్నారని చెప్పారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగిన జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. 2014 ఎన్నికల్లో అనివార్యంగా ఒంటరిగా పోటీ చేశామని, అప్పుడు సంస్థాగతంగా పార్టీ గట్టిగా లేకపోయినా ప్రజలు దీవించారని గుర్తు చేశారు. ఈసారి 119 సీట్లలో 39 సీట్లు గెలిచామని ఇది చిన్న సంఖ్య ఏమీ కాదన్నారు. మూడింట ఒక వంతు సీట్లు గెలిచామన్నారు. జుక్కల్‌లో హన్మంత్ షిండే ఓడిపోతారని అస్సలు ఊహించలేదన్నారు. కేవలం 11వందల ఓట్లతో ఆయన ఓడిపోవడంపై ప్రత్యేకంగా కేటీఆర్ ప్రస్తావించారు. నారాయణ్‌ఖేడ్ నుంచి వచ్చిన కాంగ్రెస్ నేత జుక్కల్‌లో గెలిచారన్నారు. ఇలాంటి విచిత్రాలు ఈ ఎన్నికల్లో జరిగాయని వివరించారు. దళితబంధు పథకాన్ని నిజాంసాగర్ మండలం మొత్తం ఇచ్చినా మిగతా వర్గాలు బీఆర్ఎస్కు ఓట్లు వేయలేదని చెప్పారు. ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష్య పడేలా సమాజం తయారైందన్నారు. తెలంగాణ కోసం కడుపు చించుకొని కొట్లాడేది బీఆర్ఎస్ మాత్రమేనని చెప్పారు. బీఆర్ఎస్ బలంగా లేకపోతే తెలంగాణ పదాన్ని మాయం చేసేందుకు పార్టీలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో అప్రతిష్ట మూటగట్టుకుందని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే నిరసన సెగ మొదలైందని చెప్పారు. అప్పుల బూచీ చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోరు జరుగనున్నదని, ఈ మూడు ముక్కలాటలో మనకే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని కేటీఆర్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌లను మార్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం బలంగా ఉందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక తిరోగమన చర్యలకు పాల్పడుతోందని చెప్పారు. బీఆర్ఎస్ సర్కారు తెచ్చిన పథకాలను రద్దు చేస్తున్నదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ సీటును బీఆర్ఎస్ కచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అన్నప్పుడు ఎత్తుపల్లాలు తప్పవన్నారు. 2009లో 10 అసెంబ్లీ సీట్లే గెలిచామని, కేసీఆర్ దీక్షతో ఆరు నెలల్లోనే పరిస్థితి మారిందని గుర్తు చేశారు. 1985-89 మధ్య జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ ఎన్నో మంచి పథకాలు తెచ్చినా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారని తెలిపారు. మొన్న కాంగ్రెస్‌కు ఓటేసిన వాళ్లు పునరాలోచనలో పడ్డారని చెప్పారు. కాంగ్రెస్ 420 హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ఒత్తిడి పెంచుదామన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన శక్తితో గెలవలేదని, బీఆర్ఎస్ బలహీనతలే కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణమని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ భవన్లో జరిగిన జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. సంఖ్యాపరంగా కాంగ్రెస్ గెలువొచ్చు కానీ నైతికంగా బీఆర్ఎస్ గెలిచిందన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కొందరు సొంత అభ్యర్థులనే ఓడించుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో ఎవరు సమర్ధులు ఉన్నారని ప్రజలు ఓట్లు వేశారు? ఇదీ కార్యకర్తల తప్పు కాదని పోచారం చెప్పారు. నాయకులుగా మనమే బాధ్యత వహించాలన్నారు. నాయకులు నిత్యం ప్రజల్లోనే ఉండాలన్నారు. బీఆర్ఎస్కు ఉన్న కేడర్ ఇతర పార్టీకి లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ సీఎం కానందుకు ప్రజలు బాధపడుతున్నారని, కష్టపడి పని చేస్తే బీఆర్ఎస్కు 16 పార్లమెంట్ సీట్లు రావడం కష్టమేమి కాదన్నారు. గ్రూపు తగాదాలను స్వస్తి పలికి సమష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును అందరూ గౌరవించాలని, అదే విధంగా గెలిచిన పార్టీలు కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి మాట నిలబెట్టుకోవాలని.. అది వారి బాధ్యత అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెలరోజులు అయ్యిందని.. సమీక్షల పేరుతో పరిపాలన గాలికి వదిలేశారని అన్నారు. విలువైన సమయాన్ని ఢిల్లీ -హైదరాబాద్ మధ్య తిరగడానికి వెచ్చిస్తున్నారని విమర్శించారు. కొత్త పథకాలు దేవుడెరుగు.. అమలులో ఉన్న పథకాలను వదిలేస్తున్నారని తెలిపారు. నూతన ప్రభుత్వం ఏదైనా గత ప్రభుత్వాల పథకాలను గౌరవిస్తూ, అదనంగా కొత్త పథకాలను అమలు చేయాలని అన్నారు.