నిజామాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్.. రైతాంగానికి దారుణంగా వెన్నుపోటు పొడిచింది. సాగుకు ఊతమిస్తామని గద్దెనెక్కిన హస్తం పార్టీ.. అధికారంలోకి వచ్చాక రిక్తహస్తం చూపింది. ఎన్నికలకు ముందు కురిపించిన హామీల్లో ఏ ఒక్కదాన్నీ పూర్తిగా అమలు చేయలేక ‘చేతు’లెత్తేసింది. రుణమాఫీ, రైతుబంధు, వడ్లకు బోనస్, పంటలకు మద్దతు ధర వంటి ముఖ్యమైన అంశాలను అటకెక్కించేసింది. కొందరికే రుణమాఫీ చేసిన సర్కారు.. వానకాలం రైతుబంధు ఇవ్వకుండా ఎగ్గొట్టింది. రూ.7500 చొప్పున పెట్టుబడి సాయం ఇస్తామని ఊదరగొట్టిన రేవంత్రెడ్డి.. గతంలో కేసీఆర్ ఇచ్చినట్లు రూ.5వేలు కూడా ఇవ్వకుండా రైతుల నెత్తిన శఠగోపం పెట్టారు. వాస్తవానికి జూన్ నెలలో ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం వానకాలం ముగుస్తున్నప్పటికీ రైతుకు ఇవ్వకుండా మోసం చేశారు.
అన్నదాతలను ఆర్థికంగా ఆదుకోవాలన్న సదుద్దేశంతో కేసీఆర్ రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. పంట పెట్టుబడి కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించొద్దన్న లక్ష్యంతో ప్రభుత్వమే పెట్టుబడి సాయం అందించే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని 2018 మే 10న ప్రారంభించారు. తొలి విడుతలో నిజామాబాద్ జిల్లాలో 2.39 లక్షల మంది రైతులకు మేలు చేకూరింది. ఈ సంఖ్య కేసీఆర్ ప్రభుత్వం దిగి పోయే నాటికి 2.54 లక్షల మందికి చేరింది. కామారెడ్డి జిల్లాలో 2.42 లక్షల నుంచి ఏకంగా 2.71 లక్షలకు ఎగబాకింది. వీరందరికీ కేసీఆర్ ప్రభుత్వం ప్రతి సీజన్లో దాదాపు రూ.520 కోట్ల మేర పంపిణీ చేసింది.
కేసీఆర్ హయాంలో సాగు చేసే సమయానికే పెట్టుబడి అందించారు. ఎక్కడా జాప్యం లేకుండా పంట కాలం మొదలవుతుండగానే టింగ్టింగ్మంటూ రైతుల మొబైల్ ఫోన్లకు మెసేజ్లు వచ్చేవి. అయితే, రాష్ట్రం లో అధికారం మారిన తర్వాత పరిస్థితి కూడా మారిపోయింది. వానకాలం అందించాల్సిన పెట్టుబడి సాయాన్ని రేవంత్ సర్కారు ఎగ్గొట్టింది. రైతుబంధు కింద ఇచ్చే రూ.5 వేలను పెంచి రైతుభరోసా పేరిట రూ.7,500 ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చాక గత యాసంగిలో రూ.7500 ఇవ్వాల్సి ఉండగా, రూ.5 వేల చొప్పున మాత్ర మే రైతు ఖాతాల్లో జమ చేసింది. ఇక, వానకాలంలో రూపాయి కూడా ఇవ్వకుండా మొండి‘చేయి’ చూపింది. ఈ నెలాఖరుతో వానకాలం ముగియనున్నది. పంటలు కూడా కోత దశకు వచ్చాయి. కానీ ప్రభుత్వం మాత్రం రైతుభరోసా ఊసే ఎత్తడం లేదు. పెంచి ఇస్తామన్న సాయం దేవుడెరుగు.. కనీసం రూ.5 వేలు అయినా ఇవ్వాలని రైతాంగం కోరుతున్నది.
వరంగల్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ రైతులపై వరాల వర్షం కురిపించింది. రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా కింద ఏడాదికి ఎకరాకు రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం, వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్, పంటలకు మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చింది. కానీ అమలులోకి వచ్చేసరికి మాత్రం అనేక షరతులతో రైతాంగాన్ని నిలువునా దగా చేసింది. రూ.2 లక్షల రుణమాఫీ పథకంలో అనేక ఆంక్షలు విధించడంతో చాలా మంది రైతులకు ప్రయోజనం దక్కకుండా పోయిం ది. దీనిపై ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న రైతులు సర్కారుపై పోరు ప్రారంభించారు. ధర్నాలకు దిగిన ఆర్మూర్ ప్రాంత రైతులు.. సర్కారుపై సమరభేరి మోగించేందుకు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు, వానకాలం పెట్టుబడి సాయం ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. సన్నవడ్లకే రూ.500 బోనస్ ఇస్తామని మాట మార్చింది. ఈ నేపథ్యంలో అన్నదాతల్లో మరింత ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఇక, రైతుల సంక్షేమమే ప్రాధాన్యంగా తొమ్మిదిన్నరేండ్లు పాలించిన బీఆర్ఎస్.. అన్నదాతలకు అండగా పోరాటాన్ని కొనసాగిస్తున్నది. కాంగ్రెస్ మోసాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ముఖ్య నేతలంతా ఎప్పటికప్పుడూ ఎండగడుతూనే ఉన్నారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు నిర్వహించిన గులాబీ శ్రేణులు.. రైతులకు మద్దతుగా మరిన్ని ఆందోళనలకు సమాయత్తమవుతున్నాయి.