ఖలీల్వాడి, జూలై 17: వ్యవసాయానికి మూడు గంటల కరెంటు సరిపోతుందంటూ రైతులను అవమానిస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతామని రైతులంతా ముక్తకంఠంతో నినదించారు. కరెంటు సరఫరాపై టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కర్షకులు మండిపడ్డారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మోపాల్ రైతువేదికలో సోమవారం నిర్వహించిన రైతుసభలో ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ 40ఏండ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న రేవంత్రెడ్డి..తన గురువు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ చార్జీలు పెంచారని, అప్పుడు డిప్యూటీ స్పీకర్గా కేసీఆర్ ఉండగా, చార్జీల పెంపు మంచి పద్ధతి కాదని ఆరోజే చెప్పినట్లు వివరించారు. రైతులను ఇబ్బంది పెట్టిన చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పిన రైతులు.. కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ రాకముందు కరెంటు కష్టాలు వర్ణణాతీతమని, రైతులు వ్యవసాయం చేయాలంటే అనేక ఇబ్బందులు పడేవారన్నారు.
బోరు మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడంతో పంటలు దెబ్బతినడం, కరెంటు బిల్లు కట్టకుంటే మోటర్లు లాక్కెళ్లడం, రైతులపై కేసులు పెట్టడం గత ప్రభుత్వాలు చేశాయని గుర్తుచేశారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు నాణ్యమైన కరెంటు ఇచ్చిన దాఖలాలు లేవని, అప్పట్లో కరెంటు లేక రాత్రింబవళ్లు పొలానికి వెళ్లిన రైతులు ఎంతో మంది పాముకాటు, కరెంటు షాక్తో ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగగా మార్చారన్నారు. రైతుల కోసం 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని తెలిపారు. కొందరు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. ఉనికిని చాటుకోవడానికి కాంగ్రెస్ నేత రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. రేవంత్రెడ్డి ఒక దొంగ అని, టీపీసీసీ అధ్యక్షుడు అవ్వడం దురదృష్టకరమన్నా రు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు, రైతుబంధు సమితి అధ్యక్షులు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు, రైతులు పాల్గొన్నారు.