మోర్తాడ్, మే 5: ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని పెద్దపెద్ద మాటలు చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. వారిని నమ్మించి గొంతుకోశాడని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. నాడు ఓట్ల కోసం ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ఇప్పుడు వారిని అవమానించేలా మాట్లాడడం విడ్డూరమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహారం ఓడ ఎక్కేదాక ఓడ మల్లన్న, ఓడ ఎక్కినాక బోడి మల్లన్న అనే మాదిరిగా ఉన్నదని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మైస్థెర్యం దెబ్బతినే విధంగా బెదిరింపు ధోరణితో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన తీరును వేముల తప్పుబట్టారు.
ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. అధికారంలోకి రాగానే మంచి పీఆర్సీ, పెండింగ్‌లో ఉన్న డీఏలు, 317 జీవో బాధితులకు 48గంటల్లో న్యాయం చేస్తామని, పెన్షనర్ల బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. పెన్షనర్లకు రావాల్సిన డబ్బులు రాక విగతజీవులుగా మారుతున్నా..ప్రభుత్వంలో చలనం లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఫోర్త్‌సిటీ, మూసీ ప్రాజెక్ట్, స్కిల్ యూనివర్సిటీ, అందాల పోటీలకు డబ్బులు ఉంటాయని, కానీ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు చెల్లించేందుకు డబ్బులు ఉండవా అని ప్రశ్నించారు. డబ్బుల్లేవంటూ రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందంటూ తక్కువ చేసి మాట్లాడితే పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయని నిలదీశారు.
ఒకప్పుడు తెలంగాణ ఆర్థికంగా బలంగా ఉన్నదని మాట్లాడి, ఇప్పుడేమో దివాళా తీసిందంటూ పూటకో మాటమాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఏడాదిన్నరలోనే రాష్ర్టాన్ని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికార యావకోసం హామీలు ఇచ్చేటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా అని ప్రశ్నించారు. పాలనలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఉద్యోగులను అవమానపరిచేలా, బెదిరించేలా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మాటలను పూర్తిగా ఖండిస్తున్నట్లు తెలిపారు.