నిజామాబాద్, జూన్ 5, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రైతులకు ప్రధాన జీవనాధారమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుకోవడం రైతుల్లో తీవ్ర ఆందోళన రేపుతోంది. వేసవి కాలం ముగియక ముందే నీటిమట్టం తీవ్రంగా తగ్గడం, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటి ఎత్తిపోతలు లేకపోవడం రైతులను మరింత ఇబ్బందిలోకి పడేస్తోంది. ప్రస్తుతం ఎస్సారెస్పీలో సుమారు 18టీఎంసీలు నీరు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. గత సంవత్సరం ఇదే సమయంలో 11 టీఎంసీలు మాత్రమే ఉండగా, ఈ ఏడాది కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ నీటి ఎత్తిపోతలు సకాలంలో జరగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డెడ్ స్టోరేజీ స్థాయికి చేరుకోవడంతో ప్రాజెక్టు నుంచి కనీసం నీటి విడుదల కూడా సాధ్యమయ్యే పరిస్థితి లేకుండా పోనుంది.
వానాకాలం సీజన్ దగ్గరపడుతున్న సమయంలో పంటల సాగుకు రైతులు సన్నాహాలు చేసుకుంటున్నారు. నీటి లభ్యతపై స్పష్టమైన భరోసా లేకపోవడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఎస్సారెస్పీకి నీళ్లు ఎత్తి పోయాల్సిన అధికారులు ఇంకా చర్యలు చేపట్టకపోవడం రైతు సంఘాలు మండిపడుతున్నాయి. కేసీఆర్ పాలనలో ఇలాంటి సమస్యలు ఎదుర్కోలేదు. ఆ సమయంలో ప్రభుత్వం ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని సకాలంలో నీటి విడుదల, ఎత్తిపోతలు నిర్వహించేది. ప్రభుత్వ పాలకులు మాత్రం చేష్టాలుడిగి చూస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకానికి 2017 ఆగస్టు 10వ తేదీన కేసీఆర్ భూమిపూజ చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా వరద కాలువపై మొత్తం మూడు పంప్ హౌస్‌లు నిర్మించారు. మొదటిది జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్, రెండోది ఇబ్రహీంపట్నం మండలం రాజరాజేశ్వర్ రావు పేట వద్ద, మూడోది ఎస్సారెస్పీ సమీపంలో 0.100 కిలో మీటర్ వద్ద నిర్మించారు. ఒక్కో పంప్ హౌస్‌లో ఎనిమిది మోటర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో పంప్ ద్వారా 1,450 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం కలిగి ఉంది. మొత్తం 8 మోటార్ల ద్వారా 11,600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే సామర్థ్యముంది. మేడిగడ్డ నుంచి ఎస్సారెస్పీ వరకు 300 కిలో మీటర్ల మేర కాళేశ్వరం జలాలు ప్రయాణం చేస్తాయి. వరద కాలువలో మూడు పంప్ హౌస్‌లలో ఎత్తి పోయడం ద్వా రా కాళేశ్వరం నీళ్లు ఎదురెక్కి శ్రీరాంసాగర్‌ను ముద్దాడతాయి.
ఇలా అవసరానికి అనుగుణంగా ఎస్సారెస్పీలో 60 టీఎంసీలు మేర నీటిని నిల్వ చేసుకునేలా పునరుజ్జీవ పథకం నిర్మాణం జరిగింది. ఫలితంగా వర్షాభావ ముప్పు, కరువు ఛాయల నుంచి సులువుగా బయట పడే అవకాశం ఏర్పడింది. కటిక కరువులో ఆశాదీపంలాంటి పునరుజ్జీవ పథకాన్ని మరుగన పడేసి రేవంత్‌రెడ్డి సర్కారు కాలాయాపన చేస్తోంది. నీళ్లను ఎత్తిపోసి ఎస్సారెస్పీని నింపి రైతులకు కొండంత ధైర్యం కల్పించాల్సి ఉండగా, కుట్రపూరిత రాజకీయాలతో రైతుల ఉసురు తీసుకుంటున్నారు. మోటార్లు రయ్‌మంటూ నడిస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందనే అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వం కుటిల నీతిని అవలంభిస్తోందని రైతులు మండిపడుతున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు. నీటి నిల్వ సామర్థ్యం 80.50 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 1065 అడుగులతో కేవలం 15.88 టీఎంసీలు నీళ్లు మాత్రమే నిల్వ ఉన్నాయి. కాకతీయ ప్రధాన కాలువ ద్వారా 300, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల చొప్పున ప్రస్తుతం రోజూవినియోగిస్తున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతల మూలంగా నిత్యం 410 క్యూసెక్కుల నీరు ఆవిరవుతున్నట్లుగా ఇరిగేషన్ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొద్ది రోజుల్లోనే మరింత నీటి నిల్వ తగ్గే ప్రమాదం పొంచి ఉంది. జూన్ నెలతో వానాకాలం ప్రారంభమైంది. నెల రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు లేవు. నైరుతి రుతుపవనాలతో కొద్దిగా వర్షాలు కురుస్తాయని చెబుతున్నప్పటికీ ఆశాజనకంగా వరదను తీసుకు వచ్చే అవకాశం లేదు.
జూలై, ఆగస్టు నెలలోనూ ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితి తీవ్రంగా ఉండొచ్చని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ పరిస్థితిలో 15.88 టీఎంసీలను సాగు, తాగునీటికి ఎలా వాడుతారు? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. కాంగ్రెస్ పాలకులకు ఎస్సారెస్పీ దిగువ ఆయకట్టు రైతుల పరిస్థితిపై కనీసం ధ్యాస లేకుండా పోయింది. వానాకాలం ముంచుకొచ్చినప్పటికీ కనీసం రివ్యూ మీటింగ్ పెట్టలేదు. వానలు పడకపోతే ఏం చేయాలో ప్రణాళికలు రచించలేదు. డెడ్ స్టోరీజీ ముప్పు నుంచి బయట పడేందుకు ఎలాంటి వ్యూహాలను సిద్ధం చేసుకోకపోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ముందు చూపు, భవిష్యత్తు అవసరాలపై కనీస అవగాహన లేకపోవడంతో కాంగ్రెస్ సర్కారుపై రైతులంతా దుమ్మెత్తి పోస్తున్నారు.
వరదకాలువపై ఆధారపడి పంటలు పండిస్తున్నాం. వరదకాలువలో సంవత్సరకాలం పాటు నీళ్లుంచడంతో పంటలకు సాగునీటికి ఢోకా ఉండదు. భూగర్భజలాలు పెరగడం తో బోరుబావులపై ఆధారపడి పంటలు వేసే రైతులకు సాగునీటి కష్టాలు దూర మయ్యాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కష్టాలు తప్పడం లేదు. పునరుజ్జీవ పథకాన్ని పక్కన పడేసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గం. ఇప్పటికైనా ప్రభుత్వం కండ్లు తెరిచి పునరుజ్జీవ పథకాన్ని కొనసాగించేలా చూసి, వరదకాలువలో ఏడాదంతా నీళ్లు ఉండేలా చూడాలి.
– రెంజర్ల మహేందర్, రైతు, కమ్మర్పల్లి
ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో వర్షాలు కురిసి, ఎస్సారెస్పీలోకి నీళ్లు ఏమేరకు వస్తాయన్నది ప్రశ్నార్థకమే. ఇటువంటి పరిస్థితులు వచ్చినపుడు రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీని నింపి ఆయకట్టురైతులకు సాగునీరు అందించాలన్నదే కేసీఆర్ కల. రైతుల కోసం గొప్పగా ఆలోచించి నిర్మించిన పునరుజ్జీవ పథకాన్ని కాంగ్రెస్ పక్కన పెట్టేలా వ్యవహరించడం సరైంది కాదు. పునరుజ్జీవ పథకంలో భాగంగానే రివర్స్పంపింగ్తో వరద కాలువకు నీళ్లు రావడం, ఆ తరువాత ప్రాజెక్ట్‌లోకి జీరోపాయింట్ వద్ద నీళ్లు రావడం చూశాం. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే పునరుజ్జీవ పథకం ద్వారా రైతులకు సాగునీటిని అందించాలి.
– గోపిడి సత్యనారాయణ, రైతు, మోర్తాడ్