రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై భగ్గుమన్న రైతులు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దిష్టిబొమ్మల దహనం
ఉచిత విద్యుత్‌పై ఓర్వలేకే రేవంత్ కారుకూతలు
కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామని హెచ్చరిక
ఉచిత కరెంట్ ఉండబోదన్న పీసీసీ చీఫ్
మూడు గంటల కరెంట్ చాలంటూ విసుర్లు
తీవ్రంగా తప్పుబడుతున్న వ్యవసాయదారులు
24గంటల కరెంట్ ఇస్తున్న కేసీఆర్‌పైనే రేవంత్‌రెడ్డి విమర్శలు
వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాను నిలిపివేసి, కేవలం మూడు గంటల కరెంటు ఇవ్వాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అన్నదాతలు భగ్గుమన్నారు. ఉమ్మడి జిల్లాలో మంగళవారం రైతులు, బీఆర్ఎస్ నాయకులు రేవంత్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఇవ్వక అష్టకష్టాలు పెట్టిండ్రు.. ఇప్పుడు కేసీఆర్ సారు 24గంటలు కరెంట్ ఇస్తుంటే కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని లేకపోతే కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లోని అన్నిమండలాల్లో రైతులు, బీఆర్ఎస్ నేతలు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. కామారెడ్డి జిల్లాలోని రాజంపేట, గాంధారి, రామారెడ్డి, సదాశివనగర్ మండలాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బుధవారం కూడా రైతులు ఆందోళనలు నిర్వహించనున్నారు.
నిజామాబాద్, జూలై 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం బట్టబయలైంది. ఖండాంతరాలు దాటి హస్తం పార్టీ తీరు రైతులకు ప్రస్ఫుటమైంది. అమెరికాలో తానా సభలకు హాజరయ్యేందుకు వెళ్లిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రవాసులతో మాట్లాడుతూ రైతులకు ఉచిత కరెంట్ అవసరం లేదంటూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలతో రైతులోకం తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నది. కాంగ్రెస్ పార్టీ తీరును చూసి అసహ్యించుకుంటున్నారు. ఇదేం తీరంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో హస్తం పార్టీ ఉద్దేశం తెలిసిందంటూ రైతులు చెబుతున్నారు. 2023 ముగింపులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాన ఎజెండాగా 24గంటల కరెంట్ ఉండబోదన్న వాస్తవాన్ని రైతులోకం గుర్తించింది. మూడు గంటల కరెంట్‌తో మళ్లీ పాత రోజులను తీసుకురావాలన్న అభిప్రాయంతో కాంగ్రెస్ ఉన్నట్లుగా రైతులు భావిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ తీరును ఖండిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు సైతం పలుచోట్ల రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. రైతులకు ఉచిత కరెంట్ ఇస్తుంటే హస్తం పార్టీ జీర్ణించుకోవడం లేదంటూ రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. తక్షణమే రైతులకు క్షమాపణ చెప్పాలంటూ కర్షకులు డిమాండ్ చేస్తున్నారు.
వెలుగులు ఆపే కుట్ర…
కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో రైతుల జీవితాలతో చెలగాటం ఆడుకున్నది. పొలాలకు కరెంట్ ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియక రైతులు దీనంగా చూసేది. రాత్రివేళలో ఇచ్చే కరెంట్ కోసం పొలాల్లోకి వెళ్లి పాముకాటు, కరెంట్ తీగలకు బలైన రైతులు అనేకమంది. ఇప్పుడలాంటి దుస్థితి నామరూపాల్లేకుండా పోయింది. 2014కు ముందు ఉన్నటువంటి పరిస్థితులు కేసీఆర్ పరిపాలనలో లేవు. రాత్రివేళల్లో పొలాల వద్దకు వెళ్లాలంటే ఉమ్మడి రాష్ట్రంలో రైతులు జంకే పరిస్థితి. విష పురుగుల బెడద, విద్యుత్ ప్రమాదాలతో కబళించే మృత్యువుతో రైతులు పడరాని పాట్లు పడ్డారు. అప్రకటిత విద్యుత్ కోతలు, వేళాపాలా లేని సరఫరా తీరుతో విసుగెత్తిపోయారు. భూగర్భ జలం ఉన్నా కరెంట్ లేక కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పంటను నష్టపోయిన పరిస్థితులు సమైక్యాంధ్ర పాలకుల హయాంలో అనుభవాలివి. కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, ఆర్థిక భారంగా మరమ్మతు చర్యలతో మోటర్ల వద్దనే అన్నదాతలు రోజుల తరబడి నిరీక్షణ… నాడు నిత్యకృత్యమైన ఘటనలు. సీన్ కట్ చేస్తే… లోటు విద్యుత్‌తో తెలంగాణ తొలిపాలన మొదలైన నాటి నుంచి నేడు సాగుకు 24గంటలపాటు నిరంతర విద్యుత్ సరఫరా చేసే స్థాయికి చేరింది. సీఎం కేసీఆర్ దార్శనికతతో పరిపాలన మొదలుపెట్టిన ఆరు నెలల్లోనే కరెంట్ ఇక్కట్లు పోగొట్టగా… జనవరి 1, 2018 నుంచి సాగుకు 24గంటలపాటు నిరంతరంగా విద్యుత్ అందుతుండడం విశేషం.
రేవంత్‌పై రైతుల ఆగ్రహం
తెలంగాణలో ప్రస్తుతం సాగు విప్లవం కనిపిస్తున్నది. వర్షాభావ పరిస్థితుల్లోనూ కేసీఆర్ దార్శనికతతో రూపుదిద్దుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు మూలంగా ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టుల్లోకి వేల క్యూసెక్కుల్లో దిగువ నుంచి ఎగువకు జలాలు ఎదురెక్కి వెళ్తున్నాయి. కాళేశ్వరం జలాల రాకతో పంటల సాగుపై రైతుకు ధైర్యం దొరకడంతోపాటు భూగర్భ జలమట్టం పెరుగుతున్నది. దీంతో వానకాలంలో ఆశించిన మేర వర్షాలు కురవకపోయినప్పటికీ కాళేశ్వరం జలాలతో కేసీఆర్ హయాంలో అన్నదాతలకు కొండంత భరోసా దక్కింది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కర్షకలోకం తీవ్రంగా ఖండిస్తున్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పరిపాలనను చూసిన రైతన్నలంతా వద్దు బాబు మీ పాలన… కేసీఆర్ ఉండగా మీరంతా దండగ అంటూ చేతులు జోడించి నమస్కరిస్తున్నారు. రేవంత్ వెనుక సీమాంధ్రకు చెందిన నాయకుల ప్రోద్బలం ఉన్నదని, అందుకే తెలంగాణను చీకట్లలోకి నెట్టేందుకు టీపీసీసీ అధ్యక్షుడి మాటలతో అర్థమవుతున్నట్లుగా రైతులంతా అవగాహనకు వచ్చారు. వచ్చే ఎన్నికల్లో సాగుకు మూడు గంటల కరెంట్ సరిపోతుందని చెప్పిన కాంగ్రెస్‌ను బొంద పెట్టుడు ఖాయమంటూ రైతులు చెబుతున్నారు. కేసీఆర్‌కే తమ మద్దతు ఉంటుందని కుండబద్దలు కొట్టి మరీ చెబుతున్నారు.
కాంగ్రెస్‌ను బొంద పెట్టుడు ఖాయం..
రేవంత్ రెడ్డి కుర్చీ ఎక్కక ముందే రైతులను పాతాళంలో తొక్కే ఆలోచనలు పెట్టిండు. కాంగ్రెస్ పార్టీని బొందపెట్టుడు ఖాయం. కాంగ్రెస్ పాలనలో అన్నీ కష్టాలే. బీఆర్ఎస్ అచ్చినంక రైతులకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతున్నది. పాలిచ్చే బర్రెను ఇడిచి, కాళ్లతో తన్నే పోతును తెచ్చుకున్నైట్లెతది కేసీఆర్ సారును మరిస్తే. రేవంత్ రెడ్డి ఖబడ్దార్.. క్షమాపణ చెప్పకుంటే కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తాం.
– బైండ్ల మొగులయ్య, రైతు, సోమేశ్వర్
రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్..
బాన్సువాడ, జూలై 11 : కేసీఆర్ వచ్చినంక రైతులకు మంచి జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసినం. ఏమీ ఒరుగపెట్టిం ది లేదు. రేవంత్ రెడ్డి రైతులపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తుండు. కాంగ్రెస్ ముమ్మాటికీ రైతు వ్యతిరేక పార్టీ. రా బోవు రోజుల్లో రైతులు బుద్ధి చెబుతారు. రైతులు అనుకుంటే రాజ్యం నడుస్తది. రైతులకు ఇబ్బందులు పెట్టిన చంద్రబాబు పరిస్థితిని చూస్తున్నాం. రైతులు అనుకుంటే కాంగ్రెస్‌ను తీసుకపోయి సముద్రంల పారేస్తరు.
-జైపాల్ యాదవ్, కొల్లూర్
నట్టేట ముంచుతరు..
బాన్సువాడ, జూలై 11 :కాంగ్రెస్ అంటే నే దోసుకునే పార్టీ. గసుంటి కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతులను నట్టేట ముంచుతరు. నిన్ననే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలని మాట్లాడిండు. రైతులకు వ్యతిరేకంగా పోతే బొంద పెడుతరు. గిప్పుడే రైతులను ఇబ్బంది పెట్టేటట్లు ఆలోచిస్తున్నరు. కుర్చి మీద ఎక్కితే ఆయింత ఆగరు. రైతులు కాంగ్రెస్ పార్టీని నమ్మరు. – బర్ల సాయిలు, రైతు, కొల్లూర్
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుల ఉసురుపోసుకుంటరు..
బాన్సువాడ, జూలై 11 : కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే రైతులకు 3 గంటల కరెంటు చాలని, ఉచిత కరెంటు వద్దని మాట్లాడడం చూస్తే అదే అధికారంలోకి వస్తే రైతులకు చీకటి రోజులు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాటలు విన్నంక, రైతులను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నదని అర్థమవుతుంది. కేసీఆర్ పాలనలో రైతులకు పంట పెట్టుబడిసాయం, 24 గంటల ఉచిత కరెంటు, సబ్సిడీపై విత్తనాలు తదితర రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలయి రైతులకు మేలు జరుగుతుంది. బీఆర్ఎస్ సర్కార్‌ను మర్చిపోం. కేసీఆరే మా నాయకుడు.
-వడ్ల సంతోష్ చారీ, రైతు, కొల్లూర్