ఉమ్మడి జిల్లాలో శుక్రవారం రథ సప్తమి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వరాలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు కొనసాగగా..సాయంత్రం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రథం ముందు భక్తుల కోలాటాలు, భజనలు, కీర్తనలు ఆకట్టుకున్నాయి. వేదమంత్రాలు, నృత్యాల నడుమ నీలకంఠేశ్వరస్వామి పార్వతీ సమేతంగా రథంపై ఊరేగారు.
వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. రథాన్ని లాగడానికి పోటీపడ్డారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, పలు పార్టీల నాయకులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.