కాంగ్రెస్ ప్రభుత్వం బడుగుల బతుకులను బుగ్గి చేస్తున్నది. హైదరాబాద్ మహానగరంలో పేదలు ఉండటానికి వీల్లేదని కంకణం కట్టుకున్నట్టుగా వ్యవహరిస్తున్నది. హైడ్రా పేరుతో, మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధి పేరుతో ఇండ్లు కూల్చుతున్నది. గరీబోళ్లకు నిలువనీడ లేకుండా చేస్తున్నది. కష్టపడి కొనుక్కుని, దశాబ్దాలుగా నివాసం ఉంటున్న చిన్నపాటి ఇండ్లను కూడా వదిలిపెట్టడంలేదు. ఎప్పుడు ఏ బస్తీలో బుల్డోజర్ల శబ్దాలు ప్రతిధ్వనిస్తాయో, ఏ నిద్దురపోతున్న వేకువజాముననే రోడ్డున పడాల్సి వస్తుందో అని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.
హైదరాబాద్ నగరమంటే కొందరు హైటెక్ సిటీని చూపిస్తారు. ఆకాశాన్ని తాకినట్టు ఉండే హైరైజ్ బిల్డింగ్‌లను చూపిస్తారు. హైదరాబాద్ అంటే ఇదేనా? ఈ బడాబాబులేనా నగరవాసులంటే? కాదు.. దీపం కింది నీడలా, ఈ నగర బస్తీల్లో నివసిస్తున్న లక్షలాది మంది నిరుపేదలు ఉన్నారు. వారే అసలైన నగర వాసులు. అసలైన హైదరాబాద్ అంటే బస్తీలే. వారే ఈ నగర నిర్మాతలు. బస్తీవాసులు లేకపోతే ఈ నగర జీవనం స్తంభించి పోతుంది.. నగరం నరకమవుతుంది.
బస్తీలపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తున్నది. బస్తీల జనాన్ని మనుషుల్లా పరిగణించడంలేదు. గౌరవప్రదమైన, మానవీయమైన కనీస జీవన వసతులు ఉండాలని గుర్తించడంలేదు. బస్తీ ప్రజలవి రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు.. కానీ సరైన విధంగా నిలువ నీడ ఉండదు. ఉన్నా, ఎంతకాలం ఉంటుందో తెలువదు. ఏ రోజు ఎవరు ఇండ్ల మీద పడి వెళ్లగొడుతారోనని బిక్కుబిక్కుమంటూ బతుకుతారరు. కనీస పారిశుధ్య వసతి కూడా లేని వాడలు కోకొల్లలు. ఎవరో స్థానిక నాయకుడు తానే భద్రత కల్పిస్తున్నననే భరోసా ఇస్తుంటే, తప్పనిసరి పరిస్థితుల్లో అతడి అనుచరులుగా మారి, వారు చెప్పిన పనులు చేసి పెడుతూ, రౌడీలుగా ముద్ర పడిన అమాయక యువత ఎందరో ఉన్నారు. పిల్లలకు కడుపు నిండా తిండి కూడా పెట్టలేని దీనస్థితి బస్తీ వాసులది. తమ బతుకులు ఎట్లా తెల్లారినా సరే, కనీసం పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రతి తల్లి, తండ్రి కోరుకుంటారు. కానీ వారికి కూడా తమగతే పడుతుందని తెలిసినప్పుడు కడుపు తరుక్కుపోతుంది. బస్తీ ప్రజల ఇండ్ల పక్కనే బడాబాబుల బిడ్డలు కార్లలో వెళ్తుంటే, కార్పొరేట్ స్కూళ్లలో చదువుతుంటే, బస్తీ పిల్లలకు కనీసం నడిచి వెళ్లినా నాణ్యమైన విద్య అందని దుస్థితి. బస్తీ వాసుల పిల్లలు చదివే బడులంటే సర్కార్‌కు చిన్న చూపు. ఇట్లా చెప్పుకుంటూ పోతే గల్లీల్లోని గరీబోళ్ల కథ పెద్దదే.
‘కానీ ఎంతకాలమని ఇట్లా బాధపడుతూ కాలం గడుపుదాం? మన బతుకులు, మన పిల్లల బతుకులు ఎవరో వచ్చి మార్చాలనుకుంటే ఎన్నటికీ మారవు. అనైక్యత, చైతన్యరాహిత్యమే పేద ప్రజలను ఎదగకుండా తొక్కి పెడుతున్నది. కలిసికట్టుగా వ్యవహరిస్తే, తగిన కార్యాచరణ చేపడితే, మని బతుకులు మారుతాయి. మన పిల్లలకూ బంగారు భవిష్యత్తు ఇవ్వవచ్చు. మన పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చి దిద్దవచ్చు. నగరమంతటా మూడు వేల బస్తీల్లో లక్షలాది మంది కష్టజీవులు ఉన్నారు. మనం సమైక్యంగా గర్జిస్తే, ప్రభుత్వం దిగిరాకతప్పదు’
మన శక్తి అంతటిది. మనందరం కలిసికట్టుగా ఉందాం. మన కష్టాలు ఒక్కటే, మన బతుకులు ఒక్కటే. వాటి పరిష్కారాలు ఏమిటనేది మాట్లాడుకుందాం. కలిసి కట్టుగా కార్యాచరణ చేపడుదాం. ప్రభుత్వం మూసీ ఒడ్డును సుందరీకరించే ముందు మూసీలోకి వస్తున్న పరిశ్రమల కాలుష్యాన్ని పూర్తిగా అరికట్టాలి. మూసీ సుందరీకరణలో బస్తీ ప్రజలను భాగస్వామ్యం చేయాలి. బలవంతపు తొలగింపులు ఉంటే భూసేకరణ చట్టం-2013 ప్రకారం పరిహారం ఇవ్వాలి. మూసీ అంటే హైదరాబాద్‌లో మాత్రమే ప్రవహించే నది అనే అపోహను తొలగించి, దిగువ మూసీ పరివాహక ప్రాంతంలో శతాబ్దాలుగా ఉన్న కత్వా వ్యవస్థను పునరుద్ధరించి అభివృద్ధి పరచాలి. మూసీ సరిహద్దును నిర్ణయించి మార్కింగ్ చేపట్టాలి. వీటన్నింటిపై చర్చించేందుకు ఈ నెల 7న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ వేదికగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నాం. ప్రజాస్వామిక వాదులు, విద్యార్థి, మహిళా, బస్తీ సంఘాల నేతలు దయచేసి హాజరు కాగలరు. మన హక్కులకై పోరాడుదాం.
(వ్యాసకర్త: తెలంగాణ బస్తీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్)
– గోసుల శ్రీనివాస్ యాదవ్
9849 816817