Sand Storm : రాజస్థాన్ (Rajasthan) లో ఇసుక తుపాను (Sand Storm) బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలోని చురు, శ్రీగంగానగర్, బికనీర్, సీకర్ తదితర ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం భీకర గాలులు వణికించాయి. దట్టమైన మేఘాల రూపంలో ఇసుక ఆవరించడంతో ఒక్కసారిగా చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. అనంతరం ఆయా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇసుక తుపాను కారణంగా వాహనదారులు, స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దట్టమైన ఇసుక తుపానుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా (Social Media) లో వైరల్‌గా మారాయి.
అంతకుముందు.. జైపూర్‌లోనూ శుక్రవారం ఇదే విధమైన వాతావరణం కనిపించింది. ఇసుక తుపానుతోపాటు భీకర గాలులు వీచాయి. ధోల్‌పుర్ జిల్లాలో అత్యధికంగా 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో ఈ తరహా వాతావరణం మరో నాలుగైదు రోజులు కొనసాగే అవకాశం ఉందని జైపూర్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. జైపూర్, అజ్మీర్, బికనీర్, కోటా, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్ డివిజన్లలో గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీయడంతోపాటు ఆయా చోట్ల ఉరుములతో కూడిన వర్షంపడే అవకాశం ఉందని తెలిపింది.