సామాన్యుల చదువుల సర్కారు బడి అస్తిత్వానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఎసరు తెస్తున్నది. చికిత్స చేస్తామంటూ ఆ ముసుగులో ఉసురు తీసేందుకు ఉరుకులాడుతున్నది. విద్యాకమి షన్ నివేదిక వివాదాస్పదం కావడమే ఇందుకు నిదర్శనం. పేద పిల్లలను చదువులకు దూరం చేసేలా ప్రణాళికలు అమలు చేయాలని పాలక పెద్దలు చూస్తున్నట్టు కనిపిస్తున్నది. సీఎం రేవంత్రెడ్డి తన వద్దనే అట్టిపెట్టుకున్న వివిధ శాఖల్లో ముఖ్యమైన విద్యాశాఖ కూడా ఉన్నదన్న సంగతి మనం గుర్తుచేసుకోవాలి. కానీ విద్యా వ్యవస్థ పట్ల ఆయనకు ఏ మాత్రం శ్రద్ధ ఉన్నదో గతంలో ఓయూ వంటి విద్యా వేదికలపైనే ఆయన ప్రవచనాలు తేటతెల్లం చేశాయి.
ఇక ప్రభుత్వం నియమించిన విద్యా కమిషన్ నివేదికలో సిఫారసులు సీఎం అభిప్రాయాలే అనే విషయం బహిరంగ రహస్యమే. నివేదికపై విద్యావేత్తలు, ఉపాధ్యాయుల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. సర్కార్ రక్షణ నుంచి పేదల చదువును దూరం చేయడం ఎవరికి ప్రయోజనకరమో తెలియంది కాదు. కమిషన్ సిఫారసులను చూస్తుంటే అసలు అనుమానాలు కలుగకమానవు. కాంగ్రెస్ పాలనలో తుగ్లక్ చర్యలు రాష్ర్టాన్ని అధోగతిపాలు చేస్తున్నాయి. విద్యావ్యవస్థ అస్తవ్యస్తమైంది.
వింత ప్రయోగాల కోసం కీలకమైన విద్యారంగమే దొరికిందా? ఇటీవల సీఎంకు విద్యాకమిషన్ నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో సిఫారసులు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కమిషన్ అధికారులు వెబ్సైట్ నుంచి ఆ నివేదికను తొలగించి, మళ్లీ అప్లోడ్ చేశారు. ఈ గందరగోళం అంతా చూస్తుంటే నివేదిక ఎంత అనాలోచితంగా తయారుచేశారో తెలిసిపోతున్నది. ఇక నివేదికలో వింత విషయాలను గమనిద్దాం. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే లక్ష్యంతో రూపొందించినట్టుగా ఉన్నాయి.
ఉదాహరణకు డిగ్రీ గురుకులాలను రద్దు చేయాలని, కొత్త కాలేజీలను ఏర్పాటు చేయవద్దని, ఉపాధ్యాయులను శాశ్వత ప్రాతిపదికన నియమించకూడదని, కాంట్రాక్టు పద్ధతిలోనే నియమించాలని, జీతాలు తగ్గించాలని పేర్కొనడం. ఉపాధ్యాయులకు పదోన్నతులు ఉండకూడదని, బదిలీలకు అవకాశం కల్పించవద్దని, డీఎడ్ కోర్సును రద్దు చేయాలని కూడా కమిషన్ నొక్కి మరీ చెప్పింది. మరీ విడ్డూరంగా పాఠశాలల్లో జాతీయ నేతల చిత్రపటాలను ఏర్పాటు చేయవద్దని సూచించింది. అంటే పిల్లలకు చిన్నప్పటి నుంచే మహాత్మా గాంధీజీ, అంబేద్కర్ గురించి బోధించకూడదా? మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పకూడదా? ఇలాంటి సూచనలు చేయడం వింతల్లోకెల్లా వింతనే.
ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతభత్యాల వ్యవహారం పీఆర్సీ చూసుకుంటుంది. కానీ విద్యాప్రమాణాలు ఎలా పెంచాలో చెప్పండయ్యా అంటే.. టీచర్ల జీతాలు తగ్గించండి అని సూచించే బాధ్యతను కమిషన్ ఎందుకు తలకెత్తుకుందో! అలాగైతే టీచర్లకు పీఆర్సీ, డీఏ బకాయిలు, ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులకు బెనిఫిట్స్, పెన్షనర్లకు బకాయిల గురించి కూడా చెప్పి ఉండాల్సింది కదా! జీతాలు పెంచాలని అడగకుండా, బకాయిలు ఊసెత్తకుండా నోరు మూయించేందుకే కోతల సంగతి ముందుకు తెస్తున్నారా? అనేది ప్రశ్న?
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధతో అనేక చొరవలను చేపట్టారు. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత చదువుల్లో రాణించేలా గురుకులాలను పెద్దసంఖ్యలో నెలకొల్పారు. కార్పొరేట్ కాలేజీలను తలదన్నేలా బోధన, భోజనం, వసతి సౌకర్యాలు కల్పించారు. విద్య వ్యాపారమైపోయిన ఈ రోజుల్లో పేదింటి పిల్లలకు, చదువును, భవిష్యత్తును అందించేందుకు అన్ని రకాలుగా భరోసా కల్పించారు.
హాస్టళ్లలో సన్నబియ్యం బువ్వ పెట్టడంతోపాటు స్కూళ్లలో అల్పాహారం కూడా పెట్టారు. సంక్షేమం పట్ల కేసీఆర్కు గల శ్రద్ధ. అలాంటి మానవీయ పథకాన్ని కూడా ఎత్తేసిన కాంగ్రెస్ పాలకులు, ప్రభుత్వ విద్యారంగాన్ని ఉద్ధరిస్తారని ఆశించడం అత్యాశే అవుతుంది. ఓ వైపు సర్కారు విద్య సడుగులిరిగిపోతుంటే యంగ్ ఇండియా స్కూల్స్ పెడుతామని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇదంతా ‘అమ్మకు అన్నం పెట్టని వాడు.. చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాను’ అని అన్నట్టు ఉన్నది. ప్రభుత్వం విద్యాకమిషన్ సిఫారసులపై స్పష్టమైన వైఖరి వెల్లడించాలి. విమర్శల పాలవుతున్న సిఫారసుల విషయంలో పునరాలోచన చేయడం విద్యార్థుల భవిష్యత్తుకు శ్రేయస్కరం.