ఖలీల్‌వాడి/ బీబీపేట్, సెప్టెంబర్ 9 : వీధికుక్కలు వీరంగం సృష్టిస్తున్నాయి. కనబడ్డ వారిపై దాడులు చేస్తూ గాయపరుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో నిత్యం ఎక్కడో ఒకచోట శునకాలు స్వైరం విహారం చేస్తుండడం కలవరపాటుకు గురి చేస్తున్నది. తాజాగా నందిపేట్ మండలంలో పది మందిపై దాడి చేశాయి. అలాగే, మాచారెడ్డిలో మరో ఇద్దరిని గాయపరిచాయి. వరుసగా చోటు చేసుకుంటున్న ఈ ఘటనలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కుక్క కాట్ల కేసులు పెరిగి పోతున్నా.. యంత్రాంగం పట్టనట్టు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తున్నది.
ఉభయ జిల్లాలో వీధి కుక్కల బెడద తీవ్రమైంది. పల్లె, పట్టణమనే తేడా లేకుండా అంతటా ఇదే పరిస్థితి నెలకొన్నది. ఎక్కడ చూసినా శునకాలే కనిపిస్తున్నాయి. రోడ్ల మీద గుంపులుగా తిరుగుతూ జనాల్ని భయపెట్టిస్తున్నాయి. కనబడిన వారిపై దాడులకు పాల్పడుతూ పిక్కలు పీకుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయి. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో శునకాల గుంపులు స్వైర విహారం చేస్తుంటే యంత్రాంగం మొద్దు నిద్ర పోతున్నది. అటు ప్రభుత్వం కానీ, ఇటు అధికారుల నుంచి కానీ శునక దాడులపై స్పందనే లేకుండా పోయింది. గతంలో హైదరాబాద్‌లో ఓ పిల్లాడ్ని కుక్కలు అతిదారుణంగా చంపేసిన ఉదంతం తర్వాత కొద్దిగా హడావుడి చేసినా ఆ తర్వాత పెద్దగా మార్పు రాలేదు.
నందిపేట్/మాచారెడ్డి, సెప్టెంబర్ 9 : సోమవారం నందిపేట్ మండల కేంద్రంలో పది మందిపై ఓ పిచ్చికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థితోపాటు ప్రైవేట్ దవాఖానలో ఆయమ్మగా పనిచేస్తున్న లసుంబాయి అనే వృద్ధురాలిపై దాడి చేయగా.. వారికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానిక పీహెచ్సీలో వృద్ధురాలికి ప్రథమ చికిత్స అందించి జిల్లా దవాఖానకు పంపించినట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ తెలిపారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని గజ్యానాయక్‌తండా ఎక్స్‌రోడ్ పరిధిలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న గ్రామానికి చెందిన దాసరి మౌనిక, మ్యాడం అనసూయపై పిచ్చికుక్క దాడి చేసింది. దీంతో వారు స్థానిక పీహెచ్సీలో చికిత్స తీసుకున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఏటా వేలాది మంది కుక్క కాటుకు గురవుతున్నారు. రెండు జిల్లాల్లో కలిపి వేలాది సంఖ్యలో డాగ్ బైట్ కేసులు నమోదవుతున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం.. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే గతేడాది 4,416 కేసులు నమోదయ్యాయి.
కుక్కల దాడులకు బాధితులుగా మారారు. మరోవైపు, అధికారులు చెబుతున్న లెక్కలకు రెట్టింపు స్థాయిలో
డాగ్ బైట్ కేసులు ఉంటున్నాయి.