ఊట్కూర్ : మహబూబ్ నగర్ జిల్లా బిజ్వారం అంబత్రయ క్షేత్రం గురువు ఆదిత్య పరాశ్రీ ( Aditya Parasri ) ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు ఉచిత బస్సు ( Free Bus Facility ) రవాణా సౌకర్యం కల్పించారు. మండలంలోని కొత్తపల్లి, పాతపల్లి గ్రామాల నుంచి బిజ్వారం ప్రభుత్వ పాఠశాలకు చదువుకునేందుకు వచ్చి వెళ్లే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని స్వామిజీ అందుబాటులోకి తీసుకువచ్చారు.
శనివారం బిజ్వారం జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ ( Collector Sikta Naik ) ముఖ్య అతిథిగా హాజరై ఉచిత బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించిన ఆదిత్య పరాశ్రీ స్వామిజీ సేవలను కలెక్టర్ ప్రశంసించారు.
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో పాటు పేద విద్యార్థులు చదువుకునేందుకు తనవంతు కృషిగా వసతులను కల్పించిన స్వామిజీ సేవలను కొనియాడారు. విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో చదివి తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కిషోర్ కుమార్, బిజ్వారం సర్పంచ్ అంజయ్య, కొత్తపల్లి సర్పంచ్ నరసింహులు, పాతపల్లి సర్పంచ్ తెరప్ప, ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.