న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టిన అంశంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్(KTR) స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల ఆందోళన ఓ విశిష్టమైందన్నారు. భారత రాజకీయ వ్యవస్థలో అది కీలక మలుపు లాంటిదన్నారు. ఇక ఒకవేళ పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెడితే, దక్షిణాది రాష్ట్రాలకు సరైన ప్రాతినిధ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. ద హిందూ మీడియాతో ఆయన మాట్లాడుతూ .. విద్యార్థుల నిరసన కేవలం పేపర్ లీకేజీలకు చెందిన అంశం మాత్రమే కాదు అని, కానీ ప్రజల్లో ఉన్న భావోద్వేగాలకు ఓ ట్రిగ్గర్ పాయింట్లా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, కానీ దాని నుంచి రికవరీ అయ్యేందుకు బీజేపీ ఇంకా సమయం ఉందని కేటీఆర్ అన్నారు. అయితే ప్రతిపక్షాలకు మాత్రం ఇంకా గడ్డురోజులే ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.