“మైసా’ నా కెరీర్లోనే ప్రత్యేకమైన సినిమా. తొలిసారి యాక్షన్ జానర్లో నటించాను. ఏదో ఒకటి కొత్తగా చేయాలని తపన నాకు మొదట్నుంచీ ఉండేది. ఈ సినిమా కోసం దర్శకుడు నాతో చాలా సాహసాలు చేయించాడు. రియాలిటీ కోసం చాలా కష్టపెట్టాడు. వాటర్ ఫాల్స్‌లో జంప్ చేయించాడు. ఎనిమిది గంటలు అండర్‌వాటర్ యాక్షన్ సీన్స్ చేయించాడు. ఈ సినిమా కోసం డ్యాన్స్ చేస్తూ హిప్ బోన్ బ్రేక్ అయింది.
మొత్తంగా నేను ఇంత కష్టపడ్డ సినిమా మరొకటి లేదు. టీజర్ మీకు నచ్చిందనుకుంటున్నా. సినిమా కూడా మీకు నచ్చుతుంది’ అని అగ్ర కథానాయిక రష్మిక నమ్మకం వెలిబుచ్చారు. ఆమె ప్రధాన పాత్ర పోషించిన యాక్షన్ డ్రామా ‘మైసా’. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అజయ్ సాయిపురెడ్డి, అనిల్ సయ్యపురెడ్డి, వీరసాయి గోప నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 27న విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్లో రష్మిక మాట్లాడారు.
‘గోండు ట్రైబ్ కాన్సెప్ట్ ఇది. ఇందులో గోండు తెగ చేసే గుస్సాడియా దీక్ష చాలా కీలకం. దాన్ని వాస్తవికతకు అద్దంపట్టేలా చూపించాం. ఈ కథ రాసుకున్నప్పుడే రష్మిక అని ఫిక్సయిపోయా. ఇందులో కొత్త రష్మికను ప్రేక్షకులు చూస్తారు’ అని దర్శకుడు రవీంద్ర పుల్లె చెప్పారు. ఇంకా నిర్మాత అజయ్ సాయిపురెడ్డి కూడా మాట్లాడారు.