Rajasthan : రాజస్థాన్‌లోని ఒక పాఠశాలలో విషాదకర ఘటన జరిగింది. క్లాస్‌రూమ్‌లోని బ్లాక్ బోర్డ్ మీద పడటంతో ఆరేళ్ల చిన్నారి మరణించింది. ఈ ఘటన రాజస్థాన్, జలోర్ జిల్లా, సయ్లా పోలీస్ స్టేషన్ పరిధి, బవాట్రా గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. స్థానికంగా మురుధార్ శిక్షా సంస్థాన్ అనే ప్రైవేటు స్కూల్లో ప్రీతి అనే ఆరేళ్ల చిన్నారి రెండో తరగతి చదువుతోంది.
ప్రీతి తోటి విద్యార్థులతో కలిపి క్లాస్ రూంలో ఆడుకుంటూ ఉండగా తరగతి గదిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బ్లాక్ బోర్డ్, అది ఉంచిన గోడ మీద పడిపోయింది. దీంతో ప్రీతికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారిపై మొత్తం బోర్డు, ఇటుకలు, ఇతర శిథిలాలు కూరుకుపోయాయి. గాయపడిన చిన్నారిని వెంటనే స్కూల్ సిబ్బంది దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆలోపే చిన్నారి మరణించింది. ఘటన తర్వాత పాఠశాల యాజమాన్యం పరారీలో ఉంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ స్కూల్, బ్లాక్‌బోర్డు, అక్కడి గోడలు అన్నీ చాలావరకు తాత్కాలికంగా ఏర్పాటు చేసినవిగా గుర్తించారు. సిమెంట్ గోడలు, వెదురు బొంగులు వంటి వాటితో స్కూల్లో నిర్మాణాలున్నాయి. తాత్కాలిక నిర్మాణాలు చాలా ప్రమాదకరం అయినప్పటికీ స్కూల్‌ను ఇలాగే నిర్వహించింది యాజమాన్యం. పిల్లల భద్రతకు సంబంధించిన కనీస ప్రమాణాలు కూడా స్కూల్లో లేవని పోలీసులు విచారణ సందర్భంగా గుర్తించారు.
చిన్నారి మృతి ఘటన నేపథ్యంలో అధికారుల బృందం స్కూల్లో తనిఖీ నిర్వహిస్తోంది. అనంతరం పాఠశాలపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో రాజస్థాన్‌లో మరో స్కూల్ బిల్డింగ్ కూడా కూలింది. దీంతో అక్కడ స్కూల్ బిల్డింగ్స్ సేఫ్టీపై అనుమానాలు తలెత్తుతున్నాయి. వీటి విషయంలో కచ్చితమైన ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.