వేసవి సెలవులు ముగియడంతో గురువారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. మొన్నటివరకు ఆటపాటలతో సరదగా గడిపిన చిన్నారులు బడిబాట పట్టారు. మొదటి రోజు ఎంతో ఉత్సాహంతో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లిన విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలికాయి. కొన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం, తరగతులను కనీసం శుభ్రం చేయకపోవడం గమనార్హం. జిల్లా కేంద్రంలోని దుబ్బ పాఠశాల ఆవరణలో వర్షపు నీరు నిలిచి కుంటలా మారింది.
దీంతో విద్యార్థులతో ప్రార్థన చేయించలేదు. బోర్గాం (పీ) పాఠశాల ఆవరణ బురదమయంగా మారడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పలేదు. దారుగల్లీలోని ప్రభుత్వ పాఠశాల తరగతి గదుల్లో సామగ్రిని ఉంచడంతో అస్తవ్యస్తంగా మారింది. కొన్ని పాఠశాలల్లో అటెండర్ లేనిచోట్ల విద్యార్థులతో బెంచీలను మోయించారు. వేసవి సెలవుల అనంతరం తెరుచుకున్న పాఠశాలలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సందడిగా మారాయి.