కామారెడ్డి, జూన్ 23 : నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లడానికి విద్యార్థులు వివిధ రకాల వాహనాలను ఆశ్రయిస్తుంటారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు మాత్రం తమ సొంత బస్సుల్లోనే విద్యార్థులను పాఠశాలలకు తరలిస్తుంటాయి. అయితే ఈ బస్సులను ఫిట్‌గా ఉంచడంలో యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. దీంతో ప్రమాదాలు చోటుచేసుకొని విద్యార్థులు గాయాలబారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో బస్సుల ఫిట్‌నెస్‌పై పాఠశాల యాజమాన్యాలు, డ్రైవర్లకు ఆర్టీవో అధికారులు అవగాహన కల్పించారు. బస్సులను తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నా కొందరు పట్టించుకోవడంలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు నిర్వహిస్తూ ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో దాదాపు అన్ని ప్రైవేట్ పాఠశాలలు తమ విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశాయి. విద్యార్థులను తరలించడానికి పాఠశాలల యాజమాన్యాలు ఏడాది ఫీజు వసూలు చేస్తున్నాయి. అయితే ఈ బస్సులు విద్యార్థులను ఎంత వరకు సురక్షితంగా పాఠశాలలకు చేరుస్తాయనేది బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ అనుభవంతో ముడిపడి ఉంటుంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనా కొన్ని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు తమ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించలేదు. దీంతో ఆర్టీవో అధికారులు వాటిని సీజ్ చేశారు.
పాఠశాలలకు దూరంగా తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాల బస్సు లేదా ఆటోలో పంపిస్తుంటారు. పాఠశాలల యాజమాన్యాలకు అడ్మిషన్లు, ఫీజులపై ఉన్న శ్రద్ధ విద్యార్థులు ప్రయాణించే బస్సులపై లేకపోవడం గమనార్హం. జిల్లాలో కొన్ని పాఠశాలల యాజమాన్యాలు తక్కువ ధరకు వాహనాలను కొనుగోలు చేసి రంగులు వే యిస్తున్నాయి. ఫిట్నెస్ పరీక్షలు చేయించకుండానే రోడ్లపైకి పంపిస్తున్నారు. ఈ బస్సులను అనుభవం లేని వారు నడుపుతున్నారు. రెన్యువ ల్, ఫిట్నెస్ పరీక్షలు చే యించడంలో పాఠశాల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.
జిల్లాలో పలుచోట్ల అధికారులు కూడా నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో మొత్తం 250 స్కూల్ బస్సులు ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు 210 బస్సులు ఫిట్ నెస్ పరీక్షలు చేయించుకున్నాయి. పాఠశాల ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు నాలుగు ప్రైవేట్ పాఠశాల బస్సులను సీజ్ చేశారు. పిల్లలను తమ పాఠశాలల్లో చేర్పించాలంటూ ప్రచారం కోసం లక్షల రూపాయలు ఖర్చుచేస్తున్న యాజమాన్యాలు.. పాఠశాల బస్సులను ఫిట్నెస్గా ఉంచడంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తుండడం గమనార్హం.
కామారెడ్డి జిల్లాలో పలు ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన బస్సులకు ఫిట్నెస్ లేకపోవడంతో ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. పాత వాహనాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి, వాటిని విద్యార్థులను తరలించడానికి ఉపయోగిస్తున్నారు. అంతేగాక ఆ బస్సులను నడపడానికి తక్కువ వేతనంతో అనుభవంలేని డ్రైవర్లను నియమించుకుంటున్నారు. దీంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో కామారెడ్డి పట్టణంలో షార్ట్ సర్క్యూట్‌తో బస్సులో పొగలు రావడంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేశాడు.
అందులో నుంచి చిన్నారులను దింపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఎల్లారెడ్డిలో ఓ స్కూల్ బస్సు ద్విచక్ర వాహనదారుడిని ఢీకొనడంతో అతను మృతిచెందాడు. ఇలాంటి ఘటనలు విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో తమ విద్యార్థులను పాఠశాల బస్సుల్లో పంపించాలంటేనే జంకుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి పాఠశాలల బస్సులు ఫిట్నెస్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
కామారెడ్డి జిల్లాలో 250 బస్సులకు ఇప్పటి వరకు 210 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకున్నారు. మిగతా 40 బస్సులకు చేయించుకోవాలి. పాఠశాల ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు నాలుగు బస్సులను సీజ్ చేశాం. ఫిట్నెస్ లేని బస్సులను నడపడానికి వీలు లేదు. ఒకవేళ నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఫిట్‌నెస్‌లేని వాహనాలను సీజ్ చేస్తాం.
-శ్రీనివాస్‌రెడ్డి, కామారెడ్డి జిల్లా రవాణాశాఖాధికారి