కౌకుంట్ల(చిన్న చింతకుంట), మార్చి 14 : రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన కురుమూర్తి ఆలయ సమీపంలోని కొండలపై మైనింగ్ నిలిపివేయాలని కోరుతూ నిరసన దీక్షలు చేపట్టారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ కురుమూర్తి ఆలయం వద్ద కొండల్లో అక్రమ మైనింగ్‌కు అనుమతులు ఇవ్వడాన్ని నిరసిస్తూ కురుమూర్తి స్వామి ఏడు కొండల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో దీక్ష ప్రారంభమైంది.
బీఆర్ఎస్తోపాటు ఇతర పార్టీ నాయకులు, ప్రజలు, భక్తులు భారీగా తరలివచ్చారు. కొండలను ముట్టుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. కురుమూర్తి స్వామి కోట్లాది మందికి ఆరాధ్య దైవమని, భక్తుల విశ్వాసాన్ని దెబ్బతినేలా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. సీఎం కలుగజేసుకుని వెంటనే మైనింగ్ అనుమతులు రద్దు చేసి కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.