న్యూఢిల్లీ, మార్చి 14: భారత దేశంలో సాహిత్య రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం జ్ఞానపీఠ్ అవార్డును తమిళనాడుకు చెందిన ప్రముఖ కవి, గీత, నవలా రచయిత వైరముత్తుకు ప్రకటించారు. 2025 సంవత్సరానికి సాహిత్య సేవకు ఇచ్చే ఈ అవార్డును ఎంపిక కమిటీ శనివారం ప్రకటించింది. గత 20 ఏండ్ల కాలంలో ఈ అవార్డు అందుకుంటున్న తమిళులలో వైరముత్తు మూడోవారు. సినీ పాటలు, కవిత్వం, నవలా రచనలలో వైరముత్తు చేసిన సాహిత్య సేవలకు గుర్తింపుగా ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు కేంద్రం తెలిపింది. ఈ సందర్భంగా వైరముత్తును అభినందిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ‘ఈ రోజు ఉదయమే ఆ కవితో నేను సమావేశమయ్యా. దాని తర్వాతే ఈ శుభవార్త తెలిసింది. తమిళనాడులో అఖిలన్, జయకాంత్ తర్వాత ఈ అత్యున్నత పురస్కారం ఆయనకు దక్కడం మాకెంతో సంతోషదాయకం.’ అని ఆయన పేర్కొన్నారు. ఈ సం దర్భంగా నటుడు, నేత కమల్‌హాసన్ కూడా వైరముత్తును అభినందించారు. కాగా, ఉత్తమ సినీ గేయ రచయితగా ఏడుసార్లు జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్న ఏకైక భారతీయుడిగా ఇప్పటికే వైరముత్తు ప్రసిద్ధి పొందారు. 2023లో ఆయన రాసిన ‘కల్లికట్టు ఇతికాసం’ నవలకు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. సాహిత్యానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఇప్పటికే కేంద్రం ఆయనను పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో సత్కరించింది.
తమిళనాడులో తేని జిల్లా మేట్టూరులో 1953లో జన్మించిన వైరముత్తు కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు రాసిన ‘వైకరై మేఘంగల్’ కవితా సంకలనం అప్పట్లోనే ఒక మహిళా కళాశాలకు పాఠ్యాంశంగా మారింది. తమిళనాడు ప్రభుత్వ అధికారిక భాషా కమిషన్‌లో పనిచేస్తుండగా, దర్శకుడు భారతీరాజా తెరకెక్కించిన ‘నిళల్గళ్’ చిత్రం ద్వారా 1980లో ఆయన సినీ గీత రచయితగా పరిచయం అయ్యారు. ఆయన సినిమాల్లో 7,500 పాటలు రాయగా, కవితలు, నవలలు తదితర 40 పుస్తకాలు రచించారు. సాహిత్య అకాడమీ, సాధన సమ్మాన్‌తో పాటు ఉత్తమ గేయ రచయితగా ఆరుసార్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పురస్కారాలు అందుకున్నారు. తమిళనాడు నుంచి ఇప్పటివరకు జ్ఞాన్‌పీఠ్ పురస్కారాలను అఖిలన్ (1975), జయకాంతన్ (2022) అందుకోగా, వైరముత్తు మూడోవారు.