న్యూఢిల్లీ, మార్చి 14: గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో హొర్ముజ్ జలసంధికి తమ యుద్ధ నౌకలను పంపాలని ప్రపంచంలోని అగ్ర దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. కీలకమైన నౌకా మార్గం ఏదో ఒక విధంగా తెరిచి ఉండేలా అమెరికా చర్యలు తీసుకుంటుందని తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్ పోస్టులో ట్రంప్ శనివారం హెచ్చరించారు. ఇరుకైన జలమార్గం ద్వారా నౌకల రవాణాకు అంతరాయం కలిగించడానికి ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలకు ప్రభావితమైన అనేక దేశాలు ఈ జలమార్గాన్ని పరిరక్షించుకునేందుకు అమెరికాతోపాటు పనిచేయడానికి తమ యుద్ధనౌకలను పంపుతాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కృత్రిమ అడ్డంకులకు ప్రభావితమైన చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్ తదితర దేశాలు తమ యుద్ధ నౌకలను హొర్ముజ్ జలసంధి వద్దకు పంపుతాయని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. పూర్తిగా శిరచ్ఛేదానికి గురైన దేశం వల్ల హొర్ముజ్ జలసంధితో ఇక ఎలాంటి ముప్పు ఉండబోదని ట్రంప్ పేర్కొన్నారు. హొర్ముజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ దాడులకు వెరసి వివిధ దేశాల నౌకలు జలసంధిని దాటేందుకు ప్రయత్నించకపోవడంతో సుదీర్ఘకాలం సైనిక ఉద్రిక్తతలు కొనసాగిన పక్షంలో అది ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభాన్ని తీవ్రతరం చేయగలదన్న భయాందోళనలు నెలకొంటున్నాయి.