న్యూఢిల్లీ, ఆగస్టు 10: గృహ, వాహన రుణాలు తీసుకొని ఒక్క నెల ఈఎంఐ కట్టలేకపోతే ముక్కుపిండి వసూలు చేసే ప్రభుత్వరంగ బ్యాంకులు..కార్పొరేట్లకు మాత్రం వంగి వంగి సలాంకొడుతున్నాయి. సామాన్యుల విషయంలో ఇబ్బందులు పెట్టే బ్యాంకులు.. సంపన్న వర్గాల విషయంలో మాత్రం సైలెంట్‌గా ఉంటున్నాయి. పేద, మధ్యతరగతి జీవులు పైసాపైసా కూడబెట్టి బ్యాంకుల్లో దోచుకున్న సొమ్ము..ఎగవేతదార్ల జేబుల్లోకి పోతున్నది. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశీయ బ్యాంకింగ్ రంగంలో రుణాల రైటాఫ్‌లు కనీవినీ ఎరుగని రీతిలో పెరిగిపోయాయి. దేశంలోని ప్రభుత్వరంగ బ్యాంకులు గడిచిన దశాబ్దకాలంలో ఇంచుమించు రూ.10 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేశాయి. గడిచిన 12 ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు రూ.9.95 లక్షల కోట్ల రుణాలు రైటాఫ్ చేశాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ జౌదరి పార్లమెంట్‌కు తెలియచేశారు.
రిజర్వుబ్యాంక్ నుంచి సేకరించిన సమాచారం ప్రకారం అతిపెద్ద ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్ల రుణాలు 2024-25లో రూ.63,19,057 కోట్లు ఉండగా, గడిచిన ఏడాది చివరినాటికి రూ.69,21,734 కోట్లకు చేరాయని వెల్లడించారు. సంక్షోభంలో ఉన్న రుణ గ్రహీతలకు ఉపశమనం కల్పించేందుకు రిజర్వుబ్యాంక్ ఒత్తిడికి గురైన ఆస్తుల పరిష్కారంపై మాస్టర్ డైరెక్షన్-2025ను గతేడాది నవంబర్ 28న జారీ చేసింది. ఇతర విషయాలతోపాటు రుణదాతలు తమ బోర్డు ఆమోదించిన విధానాలు, నియంత్రణ మార్గదర్శకాల ఆధారంగా, ఒత్తిడిలో ఉన్న రుణ గ్రహీతల ఆర్థిక పునర్వ్యవస్థీకరణను చేపట్టేందుకు విచక్షణాధికారాన్ని కల్పిస్తున్నదని చౌదరి పేర్కొన్నారు. మరోప్రశ్నకు ఆయన సమాధానమిస్తే.. ద్రవ్యలోటును కట్టుదిట్టం చేయగలిగామని, 2020-21లో దేశ జీడీపీలో 9.2 శాతంగా ఉన్న ద్రవ్యలోటు..2025-26లో 4.4 శాతానికి తగ్గించగలిగామన్నారు.
కేంద్ర ఖజానాకు వేలా ది కోట్ల రూపాయలు జమయ్యాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం, ఆస్తుల నగదీకరణతో రూ.45, 306 కోట్ల నిధులు సమకూరినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్‌కు వెల్లడించారు. 2025-26 సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో రూ.33,837 కోట్లు సేకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. 2025-26లో సేకరించిన రూ.45,306 కోట్ల నిధుల్లో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.16,885.56 కోట్లు, ఆస్తుల నగదీకరణ ద్వారా మరో రూ.28,420.49 కోట్లు సేకరించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.80 వేల కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు రూ.59,083 కోట్లు సమీకరించింది. వీటిలో సెంట్రల్ బ్యాంక్, కోల్ ఇండియా, ఎల్ఐసీ, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్ఎల్సీ ఇండియా, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, కొచ్చిన్ షిప్‌యార్డ్, ఇండియన్ మెడిసిన్స్ ఫార్మాస్యూటికల్స్ కార్పొరేషన్లలో వాటాలను విక్రయించింది.
బంగారంతోపాటు వెండిలపై దిగుమతి సుంకం పెంపుతో కేంద్ర ఖజానాకు రూ.10 వేల కోట్ల నిధులు జమయ్యాయి. మే 13 నుంచి ఆగస్టు 2 వరకు ఈ రెండు అతి విలువైన లోహాలతోపాటు ప్లాటినంపై దిగుమతి సుంకం పెంపుతో రూ.10,463 కోట్లు వచ్చాయని పంకజ్ చౌదరి తెలిపారు. బంగారంతోపాటు వెండిపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి సవరించగా, ప్లాటినంపై 6.4 శాతం నుంచి 15.4 శాతానికి పెంచింది. ఈ పెంపు మే 13 నుంచి అమలులోకి వచ్చింది.