మోర్తాడ్, మే 26 : రాష్ట్రంలో ప్రజా పాలన నడుస్తున్నదా..లేక రౌడీ పాలన నడుస్తున్నదా? అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. సిరిసిల్ల క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడిని ఆయన సోమవారం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ గూండాల దాడిని అడ్డుకున్న బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రతిరోజూ ఆదివారం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన పోలీసులకు సూచించారు.
ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రౌడీపాలన చేస్తున్నదని, పోలీసులను అడ్డం పెట్టుకుని నియంత పాలన నడిపిస్తున్నదని వేముల విమర్శించారు. దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజల్లో ప్రభుత్వ తీరును ఎండగడున్నారన్నారు. దాంతో బీఆర్ఎస్కు ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తుండడంతో ఓర్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర రాజకీయాలకు తెర లేపిందని విమర్శించారు. గూండాలు చేస్తున్న దాడులను ఆపాల్సిన పోలీసులే బీఆర్ఎస్ శ్రేణులపై లాఠీచార్జి చేయడం విడ్డూరమన్నారు. ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాల్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో పెట్టుకున్నారా? అని ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. మరీ ఈనాడు మా ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి ఫొటో ఎందుకు పెట్టుకోవాలో చెప్పాలని నిలదీశారు. ఏ ప్రొటోకాల్ ఉందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తన అధికారిక చాంబర్లో ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఫొటోలు పెట్టుకున్నారని ప్రశ్నించారు. పదేండ్ల అధికారంలో ఉన్నపుడు బీఆర్ఎస్ పార్టీ పూర్తి ప్రజాస్వామ్యాయుతంగా వ్యవహరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలా వ్యవహరించి ఉంటే కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై తిరిగే వారే కాదని, నేడు అధికారంలోకి వచ్చే వారే కాదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నేతల మంచితనాన్ని చేతకాని తనంగా భావిస్తే రేవంత్‌రెడ్డి సర్కార్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. హామీలు అమలు చేయకపోవడంపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై, శ్రేణులపై దాడులు చేయాలని చూస్తే సహించేది లేదని పేర్కొన్నారు. అటెన్షన్, డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతూ.. మా సహనాన్ని పరీక్షించొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.15వే చొప్పున పెట్టుబడి సాయం చేస్తామంటూ కాంగ్రెస్ ప్రకటించింది. రైతు డిక్లరేషన్ పేరిట ఊదరగొట్టింది. కానీ, అధికారంలోకి రాగానే కాంగ్రెస్ మార్క్ మోసానికి తెర లేపింది. 2023 డిసెంబర్ 7న అధికారం చేపట్టిన రేవంత్‌రెడ్డి తదనంతరం యాసంగి 2023, వానాకాలం 2024 సీజన్లలో పెట్టుబడి సాయం ఇవ్వకుండా రైతాంగానికి పంగనామాలు పెట్టారు. మొన్నటి యాసంగిలో రైతుభరోసా పథకాన్ని మొక్కుబడిగా ప్రారంభించారు. ఎకరాకు రూ.15వేలు ఇస్తామని రూ.12 వేలకే కుదించారు. అదైనా అందరికీ ఇచ్చారా? అంటే అదీ లేదు. యాసంగి ముగిసినప్పటికీ ఉమ్మడి జిల్లాలో సగం మంది రైతులకు పెట్టుబడి సాయం రాలేదు. ఇప్పుడు మరో వారంలో వానకాలం మొదలు కానుంది. పెట్టుబడి సాయం ఎదురుచూస్తున్న రైతాంగం ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నది. కేసీఆర్ ఉన్నప్పుడు ఠంచన్‌గా రైతుబంధు వచ్చిందని, కాంగ్రెస్ అధికారం చేపట్టాక ఎగవేతలతోనే సరిపెడుతున్నదని రైతులు మండిపడుతున్నారు.
కోటగిరి, మే 26: వానకాలం ప్రారంభమైంది. రైతు భరోసా ఇంతవరకూ ఊసే లేదు. రైతులకు మాయ మాటలు చెప్పిన అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశాడు. రైతు భరోసా ఇస్తానని చెప్పి ఇప్పటివరకూ పూర్తిగా అమలుచేయలేదు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పంట పెట్టుబడి సాయం సకాలంలో వచ్చేది. ఫోన్‌కు టింగ్ టింగ్‌మంటూ మెస్సేజ్ వచ్చేది. రేవంత్ సర్కారు వచ్చినప్పటి నుంచి రైతుభరోసా లేదు. నాలుగు విడుతలుగా రావాల్సిన రైతుభరోసా మాకు ఒక్కసారి కూడా రాలేదు. ఇదేం ప్రభుత్వమో అర్థం కావడం లేదు.
– దిలీప్పటేల్, రైతు, ఎత్తొండ
ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ ఏమైంది.? పంటలకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తానని గొప్పలు చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడేం మాట్లాడుతలేడు. వానకాలం మొదలైంది. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలంటే పెట్టుబడి కావాలి. ఇంతవరకు రైతు భరోసా పత్తాలేదు..? అదే కేసీఆర్ సారూ ఉండగా పెట్డుబడి సాయం టైంకు వచ్చేది. వచ్చిన డబ్బులతో ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసే వాళ్లం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చి మోసం చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ప్రభుత్వం మీద నమ్మకం పోయింది.
– ఎం. దేవేందర్‌రావు, రైతు, ఎత్తొండ క్యాంప్
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇస్తానని చెప్పిన రైతుభరోసా ఎకరానికి రూ. 15వేలకు బదులు రూ.12 వేలకు ఇస్తానని చెప్పారు. కానీ అది కూడా సక్కగా ఇస్తలేరు. నాలుగు విడుతలుగా ఇవ్వాల్సిన రైతుభరోసా ఒక్కసారి కూడా అమలు చేయలేదు. చేసిన వాటిలో సగం మందికి కూడా సక్రమంగా ఇవ్వాలేదు. నాకు 12 ఎకరాలు ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా రైతుభరోసా రాలేదు. కేసీఆర్ సారూ ఉండగా పెట్టుబడి సాయం సమయానికి వచ్చేది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రైతులకు అన్ని రకాలుగా బాగుండే.
-ఎస్. గోవిందు, రైతు, ఎత్తొండ క్యాంప్